*ఎస్సీ, ఎస్టీ పదో తరగతి ప్రతిభావంతులకు ఘనంగా ప్రతిభా పురస్కారాలు*
*అంబేద్కర్ భవనంలో విద్యార్థులకు సత్కారం.. స్కాలర్‌షిప్‌ల పంపిణీ*
రామాటాకీస్ వద్ద అంబేద్కర్ భవనంలో డా. బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మరియు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నిర్వాహకులు, ముఖ్య అతిథులు విప్లవ వీరుడు, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా “జై భీమ్” నినాదాలతో హాల్ మార్మోగింది. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. విద్యార్థులందరూ ఇంకా బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సాధించి సమాజానికి సేవ చేయాలని వారంతా కోరారు. ఈ అభినందన సభ విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు వేదికపై ఉన్న పెద్దల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు, స్కాలర్షిప్ లను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.