విశాఖ ఖాకీ వీరులకు సన్మానం
విశాఖపట్నం 18 ఏప్రిల్ 2026: నగరంలోని పోలీసు శాఖ నందలి విశిష్ట సేవలను, ప్రతిభాపాటవములు మరియు ధైర్యసాహసాలను గుర్తించి వారిని ఉచితరీతిలో సత్కరించు కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ ఇండియా వారు ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. రాజకీయ, కుల మతాలకు అతీతమైన స్వచ్చంద సంస్థ రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో వైజాగ్ రౌండ్ టేబుల్-77 వారు నగరంలోని పోలీసు సిబ్బంది అంకితభావంతో అందించిన సేవలను గుర్తించి “ నైట్స్ ఇన్ ఖాకీ ” పేరిట వారిని సన్మానించు కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్ నందు ఉత్సాహంగా తమ అయిదవ ఎడిషన్ నిర్వహించారు.
పోలీసు సిబ్బంది సత్కార కార్యక్రమంలో నగర పోలీసు కమీషనర్ శ్రీ శంఖ బ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని , ట్రాఫిక్, క్రైమ్, ఇంటెలిజెన్స్ తదితర వివిధ విభాగాలలో విశిష్ట సేవ, అంకితభావం మరియు నిబద్ధత కనపరచిన 30 మంది అవార్డు గ్రహీత పోలీసు సిబ్బందిని వారి కుటుంబ సభ్యులు, పుర ప్రముఖులు, ఇతర పోలీసు సిబ్బంది సమక్షంలో సన్మానించారు. “ నైట్స్ ఇన్ ఖాకీ ” అనే కార్యక్రమం పోలీసు శాఖలో శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజల భద్రతకు భరోసాకు అవిశ్రాంతంగా శ్రమించే పోలీసు సిబ్బందిని గుర్తించి సత్కరించడానికి రౌండ్ టేబుల్ వైజా-77 రూపొందించిన ఒక విశిష్ట సన్మాన వేదిక. ఇలాటి కార్యక్రమాలు పోలీసు శాఖకు మరియు ప్రజలకు మధ్య అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. పోలీసు సిబ్బందిలోని అమూల్య సేవలను గుర్తించి సన్మానించటం ద్వారా అది ఇతరులకు స్పూర్తిదాయకం అవుతుంది.
రౌండ్ టేబుల్ ఇండియా వారు “ విద్య ద్వారానే స్వేచ్చా “ (ఫ్రీడం త్రూ ఎడ్యుకేషన్) అనే జాతీయ నినాదం ప్రేరణతో విద్యా వ్యాప్తికి అనేక కార్యక్రమాలను స్వచ్చందంగా చేపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రౌండ్ టేబుల్ ఇండియా వారు దేశ వ్యాప్తంగా 3,782 పాఠశాలల్లో 9,272 పైగా తరగతి గదులను నిర్మించారు. తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరినట్లు ఈ సందర్భంగా శ్రీ రోహిత్ బజాజ్, చైర్మన్, వైజాగ్ రౌండ్ టేబుల్-77 తెలియచేసారు. అంతేకాక నిరుపేద విద్యార్థులు కోసం డిజిటల్ తరగతి గదులను, తాగు నీటి సదుపాయములు, తరగతి గదులకు అవసరమైన ఫర్నీచర్ మరియు మౌలిక వసతులు కల్పించుటకు మరియు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు వంటివి నిర్వహించుటకు తమ సంస్థ మద్దతు అందిస్తున్నట్లు శ్రీ రోహిత్ బజాజ్ పేర్కొన్నారు.
రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో వైజాగ్ రౌండ్ టేబుల్-77 వారు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఈ పోలీసు సిబ్బంది సన్మాన కార్యక్రమం ఒక కీలకమైన మైలు రాయిగా గుర్తింపు పొందినది. భారతదేశంలోని అనేక నగరాలకి ఇది విస్తరించి “ నైట్స్ ఇన్ ఖాకీ ” కార్యక్రమానికి అత్యంత ఆదరణ పెరుగుతు న్నాది.