ధరలు అదుపుచేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం వామపక్షాలు డిమాండ్

by vvwnews.com

*ధరలు అదుపుచేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం*
*సిపిఎం ధర్నాలో జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు హెచ్చరిక*
నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పెరిగే చర్యలు తీసుకోవడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. దీనికితోడు విద్యుత్‌ ట్రూఅప్‌,ఇంథనపు ఛార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం వేసే చర్యలు వెనక్కుతీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
ధరలకు నిరసనగా, స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, మహిళలకు రక్షణ, యువతకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్‌తో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టింది. ధర్నా అనంతరం తహశీల్ధార్‌కి వినతిపత్రాన్ని అందజేసారు. సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షత వహించిన
*ఈ ధర్నాలో జగ్గునాయుడు మాట్లాడుతూ* ఎన్నికల ముందు ధరలు అదుపుచేస్తామని టిడిపి`జనసేన`బిజెపి కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. నిత్యం వాడే పప్పులు, వంటనూనె, పోపుదినుసులు, కారం, చింతపండు, బియ్యం వంటి ధరలతో పాటు కాయగూరల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి ధరలు కూడా పెంచిందన్నారు. ఈ ధరలు అదుపుచేయాలంటే ప్రభుత్వం రేషన్‌డిపోల ద్వారా నాణ్యమైన బియ్యం, 16రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేసారు. ప్రజల ఆదాయాలు పెంచ బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కరెంట్‌ ట్రూఅప్‌ ఛార్జీల భారాన్ని మోపడానికి సిద్దపడటం సిగ్గుచేటన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం డిస్కంలను ప్రైవేట్‌పరం చేస్తే దానిని చంద్రబాబు గతంలో కూడా అమలు చేయడం, నేడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. ధరలు అదుపు చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
*సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జివిఎంసి ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ* స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నేడు అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్‌ కార్మికులను 4వేల మందిని, పర్మినెంట్‌ కార్మికులను వి.ఆర్‌.ఎస్‌ పేరుతో తొలగించడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటే శోద్యం చూస్తున్నారని విమర్శించారు. మరోవైపు పర్మినెంట్‌ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం, కరెంటు ఛార్జీలు భారీగా పెంచడం వంటి చర్యలకు పూనుకుందన్నారు. ప్లాంట్‌ భూములను అధానీకి కట్టబెట్టేందుకు చంద్రబాబు పూనుకోవడాన్ని తప్పుపట్టారు. విశాఖకు వచ్చిన చంద్రబాబు, పవన్‌లు ఋషికొండ ప్యాలెస్‌ చుట్టూ తిరిగారు తప్పా స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్లాంట్‌ ప్రభుత్వరంగంలో కొనసాగితేనే ఆంధ్రరాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు భవిష్యత్‌ ఉంటుందని ప్రైవేట్‌పరం అయితే ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులున్నా వాటిని భర్తీకి పూనుకోకుండా రిటైర్డ్‌ ఉద్యోగులను కొనసాగించడం యువత భవిష్యత్‌ను నిర్వీర్యంచేయడమేనన్నారు.
*సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.మణి మాట్లాడుతూ* కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి`జనసేన కూటమి ప్రభుత్వాలు కార్మికులకు, రైతులకు ద్రోహం చేస్తున్నాయన్నారు. కార్మికచట్టాలు ఉన్నప్పుడే కార్మికులకు ఏ న్యాయం జరగటం లేదని ఇప్పుడు కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్స్‌ తేవడం వలన ఉన్న భద్రత కోల్పోవాల్సి వస్తుందన్నారు. పోలీస్‌లతో కార్మిక ఉద్యమాలను అణిచివేయడంలో చంద్రబాబు దిట్టన్నారు. కార్మికులకు కనీసవేతనం 26వేలు అమలుచేయాలని, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అదేసమయంలో శ్రామిక మహిళలపైన, సాధారణ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, వేధింపులు జరుగుతున్నా ఈ ప్రభుత్వాలు మహిళలకు రక్షణగా ఉండటం లేదని అన్నారు. ఆక్సిజన్‌ టవర్‌లో గంగ అనేక ఇంటిపనిమనిషిపై జరిగిన దాడే దానికి ఉదాహరణగా పేర్కొన్నారు. మద్యం ఏరులై పారుతోందని, దీనివలన ఆడపడుచుల జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. ఈ విధానాలపై ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జగదాంబ జోన్‌ కన్వీనర్‌ ఎం.సుబ్బారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యు.ఎస్‌.ఎన్‌.రాజు, వి.నరేంద్రకుమార్‌లు ప్రసింగించారు. జోన్‌ నాయకులు పి.శంకరరావు, కె.కుమారి, జి.అప్పలరాజు, వరలక్ష్మి, కె.మణి, పి.గౌరీష్‌, అప్పారావు, చంద్రశేఖర్‌, నాయుడు, ఎం.చంటి, కుమార్‌ మంగళం తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
వి.కృష్ణారావు
కార్యదర్శి
మద్దిలపాలెంజోన్‌

Use Social Media to Spread the Word about Our News

related articles