సింహగిరిపై అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. #vvwnews

by vvwnews.com

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం

సింహగిరిపై అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.

…….. భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు

………..పాల్గొన్న ఈవో దంపతులు

విశాఖపట్నం, మార్చి 27, 2026:
సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిభావం వెల్లివిరిసింది. శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయాలైన, కొండపై గంగధార చెంత కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయం మరియు రాజగోపురం ఎదురుగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా జరిగింది.

లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకటరావు దంపతులు రామాలయంలో స్వామి అమ్మవారు లను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఫలపుష్పాలను ,మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి కళ్యాణ వేదికకు చేరుకుని శ్రీ సీతారాములవారికి సమర్పించారు.

ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, సీతారామాచార్యులు,అర్చక స్వాములు,మరియు వేద పండితుల ఆగమ శాస్త్రం ప్రకారం వేడుకలు నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనములతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వామివారికి, అమ్మవారికి కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ గావించారు.

సుముహూర్తాన జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ ఘట్టాలను అత్యంత కమనీయంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల శిరస్సుపై ముత్యాల తలంబ్రాల వర్షం కురుస్తుండగా, భక్తుల జయజయధ్వానాల మధ్య గంగధార ప్రాంగణం మారుమోగిపోయింది.

ఈ వేడుకలో సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరావు, వి.రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు దేవస్థానం పర్యవేక్షణ అధికారులు, దేవస్థానం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ప్రసాదాల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

కళ్యాణం అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేయడంతో పాటు, మహిళా భక్తులకు ప్రత్యేకంగా బ్లౌజ్ పీసులను కానుకగా అందజేశారు. అనంతరం మంత్రపుష్పం, మంగళాశాసనములతో కళ్యాణ క్రతువు సంపూర్ణమైంది.

కళ్యాణానంతరం ఈవో శ్రీ జె. వెంకటరావు మాట్లాడుతూ.. “సీతారాముల కళ్యాణం లోకానికి శుభప్రదం. స్వామివారి వైభవాన్ని చాటిచెప్పేలా ఈ కళ్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించాము. స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ గారు సీతారాముల విశిష్టతను భక్తులకు వివరించడం విశేషం. అధికారులు, సిబ్బంది మరియు భక్తులందరి సహకారంతో ఈ మహోత్సవం విజయవంతమైంది” అని తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles