కొల్లేరు సరస్సు విధ్వంసాన్ని అరికట్టకపోతే పర్యావరణ వినాశమే! జల బిరాదరికన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ

by vvwnews.com

కొల్లేరు సరస్సు విధ్వంసాన్ని అరికట్టకపోతే పర్యావరణ వినాశమే!… జల బిరాదరి నేషనల్ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరిక.
విశాఖ పట్నం, మార్చి 22.
గత 50 సంవత్సరాలుగా తీవ్రమైన విధ్వంసానికి గురవుతున్న కొల్లేరు సరస్సును యుద్ధ ప్రాతిపదికన రక్షించక పోతే పర్యావరణం వినాశనమయ్యే ప్రమాదం ఉందని జల బిరాదరి నేషనల్ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో 1975వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు కొల్లేరు సరస్సులో జరిగిన విధ్వంసం, వినాశనం అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1000 సంవత్సరాల పాటు అనేక రాజవంశాల పాలనలోనూ, ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ వారి పాలనలోనూ చెక్కుచెదర కుండా ఉన్న ఈ సరస్సు 1975వ సంవత్సరం తరువాత తీవ్రమైవ విధ్వంసానికి గురవుతోం దన్నారు. ఆనాడు సుమారు 2,22,600 ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు ఇప్పుడు పలు ఆక్రమణలు, విధ్వంసాల అనంతరం కేవలం 90,000 ఎకరాలకే పరిమిత మవ్వడం పర్యావరణ ప్రియులకు అత్యంత ఆందోళనకర మన్నారు. గత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో ప్రారంభమైన ఈ సరస్సు క్షీణత ఆ తరువాత వచ్చే ప్రభుత్వాల్లో మరింత ఎక్కువైందన్నారు. వై ఎస్ రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆపరేషన్ కొల్లేరు అనే పేరుతో చేసిన హడావుడి సుప్రీం కోర్టు కళ్లకు గంతలు కట్టడమే తప్ప వాస్తవంగా కొల్లేరు సరస్సును రక్షించే చర్య కాదన్నారు. ఇదే విధంగా కొల్లేరు సరస్సుకు గల సుదీర్ఘ, విస్తారమైవ సరిహద్దులను రక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ నాటి, నేటి ప్రభుత్వాలు అపహాస్యం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ఆధారాలతో సహా దేశంలోని అన్ని వ్యవస్థల అధినేతలకు ఫిర్యాదులు చేస్తున్నా మన్నారు. ఈ భూమి మీద ప్రాణ కోటి మనుగడకు ప్రాణాధారమైవ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఎ చెబుతోందని దాన్ని కూడా మన పాలకులు కాలరాయడం క్షమార్హం కాదన్నారు. కొల్లేరు సరస్సుకు జరుగుతున్న విధ్వంసం వల్ల పక్షుల అంతం మానవ యుగాంతానికి ఆరంభమయ్యే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. దీన్ని అరికట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాల వారు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

Use Social Media to Spread the Word about Our News

related articles