జీతం కష్టార్జితం, హక్కు తక్షణమే చెల్లించాలి
విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితం అని దీనిని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గు నాయుడు ప్రభుత్వ,యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలన్న సర్కులర్ తక్షణం రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని, సెయిల్ లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, సిఎండి పై సిబిఐ విచారణ చేయాలని, ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ సక్రమంగా అందించాలని తదితర డిమాండ్లతో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా ఉద్దేశించి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను తన తాబేదారులకు కట్టుబెట్టాలనే నిర్ణయాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దానికి వంతపాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్ లోని రా మెటీరియల్ నాణ్యతా లోపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్య రామ్ మాట్లాడుతూ యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలతోనే గడచిన నెల 240 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దీనికి కార్మికులను బాధ్యులను చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్ ఎల్ సి గారు ఇచ్చిన ఆదేశాలను సైతం యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ, ఉక్కునగరం లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీలు తగ్గించే చర్యలు నేటికీ చేపట్టకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. కార్మికుల కష్టార్జితమైన పూర్తి వేతనాన్ని సకాలంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని స్టీల్ మంత్రులు ప్రైవేటీకరణ లేదంటూనే స్టీల్ ప్లాంట్ లో కీలక విభాగాలలో ఆపరేషన్ లో టెండర్ల పిలవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రా మెటీరియల్ సరియైన సమయానికి అందిస్తే ఉత్పత్తి చేయడానికి కార్మికులకు సిద్ధంగా ఉన్నారని గడచిన నాలుగు రోజులలో నిరూపించారని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్ రక్షణకు అహర్నిశలు పనిచేస్తున్న కార్మికులను, అధికారులను దోషులుగా చిత్రీకరించే యాజమాన్య వైఖరిని తక్షణం మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా సిఐటియు అధ్యక్షులు కె ఎం శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎం రామారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రధానం గా ఉన్న అవరోధం సొంత గనులు లేకపోవడమే అని వారు అన్నారు. వాటిని నిర్లక్ష్యం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడానికి వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, బి తౌడన్న, టి వి కె రాజు, బి ఎన్ మధుసూదన్, బి మహేష్, ఎం మరిడయ్య, పట్టా రమేష్, డి ఎస్ వి ఎస్ శ్రీనివాస్, వి ప్రసాద్, మొహిద్దిన్, కె అప్పారావు, శ్రీనివాస్ రెడ్డి, దుర్గాప్రసాద్, రాజు, పృద్వి, కె ఆర్ కె రాజు, అప్పలరాజు, సిహెచ్ వెంకట్రావు, రామన్న, వి మురళి తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో యువ కార్మికులు పాల్గొన్నారు.
వి ప్రసాద్
ఉపాధ్యక్షులు
మా జీవితం మా కష్టార్జితం మా సొంత
12