గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరుపయోగం #vvwnews

by vvwnews.com

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార

• గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరుపయోగం
• కేరళ రూ.45 వేల కోట్లు ప్రతిపాదనలు ఇస్తే… ఆంధ్రప్రదేశ్ రూ.26 వేల కోట్లకే ప్రతిపాదనలే పంపింది
• గత పాలకుల తప్పిదాలతో పథకం అస్తవ్యస్తం
• జల వనరుల నుంచి సరఫరాకు ప్రణాళికలు లేకుండా పైపులు, బోర్లు వేసేశారు… నీళ్ళు మాత్రం ఇవ్వలేదు
• ఇటీవల కేంద్ర మంత్రివర్యులను రూ.70 వేల కోట్లు కావాలని కోరాం
• సమగ్ర డీపీఆర్ తయారీ చేసి అందిస్తే పథకం గడువు పెంచేందుకు కేంద్రం సుముఖం
• ప్రతి జిల్లా ఓ యూనిట్ గా మంచి నీటి వెతలు శాశ్వతంగా తీర్చేలా ప్రణాళిక తయారు చేయండి
• విజయవాడలో బుధవారం నిర్వహించిన జల్ జీవన్ మిషన్ ‘అమృతధార’ వర్క్ షాపులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘జల్ జీవన్ మిషన్ పనుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడున్న నీటి వనరులకు కొత్తరూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం అవసరం. నీటి నిర్వహణ, సరఫరా విషయంలోనూ పటిష్టమైన ప్రణాళిక ఉండాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలనే బృహత్తర ప్రణాళికకు అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జల్ జీవన్ మిషన్ పనులకు ఎలా మొదలుపెట్టాలి… ఎలా ముందుకు తీసుకెళ్లాలి… పటిష్టంగా ఎలా పూర్తి చేయాలనే విషయాలను అధికార యంత్రాంగం సమన్వయం చేసుకొని పనిచేయాలని, కేవలం పనులు చేసి వదిలేయడం కాకుండా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు (గ్రీవెన్స్) కోసం కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం సమర్థంగా అమలు చేసేందుకు, జిల్లావారీగా ప్రత్యేక డీపీఆర్ తయారు చేసేందుకు, పథకం ఫలాలను వినియోగించుకునేందుకు అన్ని జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ‘అమృతధార’ కార్యక్రమం వర్క్ షాపును విజయవాడలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరై కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగు నీటి అవసరాలను గుర్తించి ముందుకు వెళ్లాలి. జల్ జీవన్ పనులన్నీ ప్రజలకు ఫలాలు అందించాల్సిన తరుణంలో వారి సూచనలకు పెద్దపీట వేయాలి. జన వనరుల లభ్యత, వాటి నుంచి పొందాల్సిన ప్రయోజనం, ఇతర అంశాలను నిశీతంగా పరిశీలించి శాశ్వతంగా ఫలితాలు అందేలా జల్ జీవన్ మిషన్ పనులను మొదలుపెట్టాలి.
• ఇప్పటికీ తాగు నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు
స్వాతంత్య్రానంతరం భారతదేశం ప్రజలకు తాగు నీటిని అందించేందుకు లక్షల కోట్లను ఖర్చు చేసింది. ప్రతి మనిషికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ప్రతి మనిషికీ సగటున రోజుకి 55 లీటర్ల మంచి నీరు అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆకాంక్షల మేరకు మొదలైంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం సందర్భంగా కాని, రంజాన్ రోజుల్లో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షల్లో గాని ఒక పూట నీరు అందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. 2008లో ఆదిలాబాద్ తండాల్లో తిరుగుతున్నపుడు చూపులేని ఓ వృద్ధురాలు కాస్త నీళ్లిప్పించయ్యా.. అన్న మాట నాకెప్పుడూ తల్చుకున్నా కళ్లలో గిర్రున నీళ్లు తిరిగేలా చేస్తాయి.
నా శాఖల్లో అత్యంత కీలకమైంది.. నాకు ఇష్టమైంది గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించే కీలక బాధ్యత. స్వచ్ఛమైన తాగునీరు అందితే ప్రజల సంతోషం అంతాఇంతా కాదు. వారికి స్వచ్ఛమైన నీరు అందితే చాలావరకు ఇతర సమస్యలు తొలగిపోతాయి. ప్రజలంతా ఆనందంగా ఉండటానికి మంచినీరు అందడం అనేది ప్రధానం.
• కేరళ కంటే తక్కువగా ప్రతిపాదనలు
ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టాక జల్ జీవన్ మిషన్ పనుల గురించి పలుమార్లు సమీక్ష చేశాను. ఇంతటి కీలకమైన పథకం, ప్రజలందరికీ మేలు చేసే ఈ పథకం తీరుతెన్నులను, జరిగిన పనులను తెలుసుకున్నాను. అనుకున్నంత విజయవంతంగా పనులు జరగలేదని అర్థమైంది. 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభించే ముందు ప్రతి రాష్ట్రం తాగునీటి అవసరాలకు సంబంధించి, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించేందుకు ఎంత మేర నిధులు అవసరం అవుతాయని కేంద్ర ప్రభుత్వం – రాష్ట్రాలను ప్రతిపాదనలు అడిగినపుడు ఉత్తర ప్రదేశ్ రూ.1.50 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.83 వేల కోట్లు, గుజరాత్ రూ.32 వేల కోట్లు, కేరళ రూ.45 వేల కోట్లు అడిగింది. కేరళను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న రాష్ట్రం. అయినప్పటికీ వారు భవిష్యత్తు అవసరాలు, ప్రజలకు అందించాల్సిన పూర్తి తాగునీటి పనులు కావాలంటే నిధులు ఎక్కువ అవసరమవుతాయనే ప్రణాళికతో అంత మొత్తం అడిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వ పాలకులు మాత్రం కేవలం రూ.26 వేల కోట్లు చాలు అన్నట్లుగా ప్రతిపాదనలు పంపారు.
• గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు
దీంతో కేంద్రం మొదటి దశలో రూ.4,787 కోట్ల పనులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కచ్చితంగా రాష్ట్ర వాటాగా మ్యాచింగ్ గ్రాంటు కేటాయించాలనే నిబంధన ఉంటుంది. జల్ జీవన్ మిషన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మ్యాచింగ్ గ్రాంటు కూడా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాం.
• పథకం ఆశయాలకు తూట్లు పొడిచి బోర్ వెల్స్ కు అనుసంధానం
జల్ జీవన్ మిషన్ పనుల్లో శాశ్వత నీటి వనరుల మీద దృష్టి సారించడం అనేది కీలకం. నేను ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్ గారితో సమావేశం అయినప్పుడు కూడా గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకంలో సమీపంలోని రిజర్వాయర్లు, ఇతర అతి పెద్ద నీటి వనరుల నుంచి నీటిని గ్రామాలకు ఇవ్వాల్సిందిపోయి భూగర్భ జలలాను బోర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేసిందని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు జల్ జీవన్ మిషన్ పథకం అధిక

Use Social Media to Spread the Word about Our News

related articles