*లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడానికి పూర్తి బాధ్యత బీజేపీదే*
*కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలమేనని వెల్లడి*
*బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిపోయిందని విమర్శ*
*ఇప్పటికైనా డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని డిమాండ్*
*విశాఖలో ఏఐసీసీ మెంబెర్ సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలి అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ*
జన గణన, డీ లిమిటేషన్ షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీను నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని, దానికి కృషి చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమికి తావు లేదంటూ ఈ ఎన్నికల్లో రుజువైందన్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు కళ్లారా చూశారని అన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను వాడుకుని, ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని హెచ్చరించారు. రాజ్యాంగానికి కమలం పార్టీ తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులు ఆడవారిపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి.. మోడీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు మహిళలను మోసం చేస్తున్నారని, బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మహిళల పక్షపాతి కాంగ్రెస్ మాత్రమేనని, బీజేపీకి ఓటు అడిగే కనీస హక్కు లేదన్నారు. విభజన బిల్లును అమలు చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్లను పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే చోద్యం చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, కార్మికులు, యువతను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీజేపీ తన నిజాయతీని నిరూపించుకోవాలంటే, డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి మెంబర్ గుండ్లకుంట శ్రీరాములు, ఏపీసీసీ మెంబర్ గుత్తుల శ్రీనివాస్, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.