నీచ సంస్కృతి, నీచ భాష తెలుగుదేశం పార్టీలో లేదని… అదంతా వైసిపి విష సంస్కృతి
విశాఖ దక్షిణంపై “తెలుగు శక్తి” దండయాత్ర
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని డామినేట్ చేసేందుకు సీతంరాజు యత్నం
కనీసం దరఖాస్తులను కూడా ఎమ్మెల్యే కు చేరనీయడం లేదు
తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపణ
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుచరులు తనను వైసిపి కోవర్టుగా ఆరోపించడాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ జీర్ణించుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే.. తాజాగా బి.వి.రామ్ విశాఖ దక్షిణ నియోజకవర్గంపై “దండయాత్ర” ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని డామినేట్ చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే వంశీ జనసేనకు చెందిన వారని, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూరిపోస్తున్నారని బి.వి.రామ్ వ్యాఖ్యానించారు. కనీసం దరఖాస్తులు కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకొని సీతంరాజు సుధాకర్ తన వద్దకు రప్పించుకుంటున్నారన్నారు. ఈ విషయంపై ఇటు తెలుగుదేశం అటు జనసేన పార్టీలకు చెందిన అగ్రనేతలు సారించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ముందు రెండు నెలల ముందుగా వైసీపీ నుంచి వచ్చిన సీతమ్మరాజు సుధాకర్ కు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును హీనాతిహీనంగా దూషించిన సీతమ్మరాజుకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరూ లేనట్టు సీతంరాజుకు వైద్య సేవ.. అది కూడా ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవకు చైర్మన్ పదవిని కేటాయించడంతో.. తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. అంటే చంద్రబాబు నాయుడుని తిట్టిన వారికే పదవులు ఇస్తారా ? అని బి.వి.రామ్ ప్రశ్నించారు.
*అదంతా వైసిపి విష సంస్కృతి*
తనను వైసిపి కోవర్టుగా చిత్రీకరించాలని చూస్తున్న పల్లా శ్రీనివాసరావు అనుచరులు తమపై తీవ్రమైన పదజాలాన్ని ప్రయోగిస్తున్నారని బి.వి.రామ్ తెలిపారు. తాను విమర్శించినా ఎంతో హుందాగా విమర్శిస్తానని ఏనాడు కూడా స్థాయి దిగజారి మాట్లాడలేదని పేర్కొన్నారు. పల్లా అనుచరుడు తెలుగుదేశం పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాత్రం అతి నీచమైన భాషను ఉపయోగిస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారన్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో “ఒరేయ్ రామ్.. నువ్వు ఒక లుచ్చా” అంటూ తీవ్రమైన పదజాలాన్ని ప్రయోగించారన్నారు. ఇలాంటి నీచ సంస్కృతి, నీచ భాష తెలుగుదేశం పార్టీలో లేదని, ఈ దుష్ట సంస్కృతి వైసిపిలో మాత్రమే ఉందన్నారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే వైసిపి కోవర్టులు పల్లా శ్రీనివాసరావు అతని అనుచరులు అని స్పష్టంగా బహిర్గతం అవుతుందన్నారు. ఇటువంటి వ్యక్తులను పార్టీకి దూరంగా ఉంచాలని.. ముఖ్యంగా ప్రసాదుల శ్రీనివాస రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రసాదుల శ్రీనివాస్ పై కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని బి.వి.రామ్ డిమాండ్ చేశారు.
*ఒంటరిగానే చర్చకు వస్తా..*
పల్లా శ్రీనివాసరావు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో ప్రసాద్ శ్రీనివాసరావు విడుదల చేసిన వీడియోలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారన్నారు. వాస్తవానికి ఎవరు కోవర్టులో తేల్చుకునేందుకు తానే చర్చకు ముందుగా పిలుపునిచ్చానని రామ్ తెలిపారు. ఈ పరిస్థితులలో శుక్రవారం నుంచి విశాఖలో అందుబాటులో ఉంటానని..తేదీ, సమయం చెబితే తాను ఒంటరిగానే వస్తానని బి.వి.రామ్ తెలిపారు.
*నాపై ఎమ్మెల్యే గా పల్లా పోటీ చేసి గెలవగలరా?*
కార్పొరేటర్ గా కూడా గెలవలేనని చెపుతున్న ప్రసాదులకు తాను చెపుతున్న సమాధానం ఒక్కటేనన్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. మరి ఎమ్మెల్యే పదవికి పల్లా రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని సవాల్ చేశారు. తాను నామినేషన్ దాఖలు చేసి అమెరికా వెళ్లిపోతానని, ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేగా పల్లా గెలిచి చూపించాలని సవాల్ చేశారు.