హ్యూమన్ పాపిలోమా వైరస్ వాక్సిన్ తోనే మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహమ్మారిని

by vvwnews.com

హ్యూమన్ పాపిలోమా వైరస్ వాక్సిన్ తోనే మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్ట గలమని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద అన్నారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా యూనిట్ సంయుక్తంగా కోటవీధి సమీపంలోని ఫిషర్ మెన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ నియంత్రణ హెచ్. పి. వి. వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ శివానంద మాట్లాడుతూ 9 నుండి 14 ఏళ్ల లోపు వయస్సు ఉన్న జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ఎంతో అవసరమని అన్నారు. 40 ఏళ్ల వరకు వ్యాక్సిన్ వేసుకోవచ్చని, గర్భణీలు, అనారోగ్యంగా ఉన్నవారు వాక్సిన్ వేసుకోరాదన్నారు. దేశంలో 25 శాతం మంది మహిళలు గర్భాశయ ముఖద్వార కాన్సర్తో చనిపోతున్నారని ఈ వ్యాక్సిన్ తోనే క్యాన్సర్ ను  తరిమికొట్టగలమని చెప్పారు.ఈ వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకోవాలని ఆరు నెలల తర్వాత మరో డోసు వేయించుకోవాలని తెలిపారు. హెచ్పీవీ వ్యాక్సిన్పై అన్ని వర్గాల్లోనూ అవగాహన ఉండాలని ముఖ్యంగా మీడియా ఈ విషయమై విస్తృత ప్రచారం చేసినట్లయితే సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షిరీన్ రెహమాన్ మాట్లాడుతూ  హెచ్.పి.వి వైరస్ వ్యాక్సిన్ శిబిరాలు వరుసగా నిర్వహిస్తున్నామని జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని చెప్పారు.14 ఏళ్ల దాటిన ఆడపిల్లలైతే మూడో డోస్ కూడా వేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. క్యాన్సర్ నియంత్రణ వ్యాక్సిన్ తోనే సాధ్యమన్నారు.
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ  జర్నలిస్టుల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ముదావహమన్నారు. మున్ముందు మరిన్ని సమాజహిత కార్యక్రమాలు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిర్వహిస్తుందని అందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరం అన్నారు. ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శివానంద సహకారంతో జర్నలిస్టుల కోసం మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు.ఆసుపత్రి అభివృద్ధికి ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. క్యాన్సర్ వ్యాక్సిన్ శిబిరం నిర్వహణకు సహకరించిన షిరీన్ రహమాన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ మేనేజర్ రాంరతన్, ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు  చైతన్య స్రవంతి ప్రతినిధులు రుకుయాభాను, ఉమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సుమారు 50మందికి పైగా జర్నలిస్టుల పిల్లలు ఈ వ్యాక్సిన్ వేయించుకొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles