పర్యావరణ పరిరక్షణకు యువత కృషి అవసరం
– పర్యావరణ హితంగా జీవించాలి
– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలి
– డాక్టర్ ఎం వివి మురళీ మోహన్, కేంద్ర కార్యవర్గ సభ్యులు, భారత ప్రజారోగ్య సంస్థ
పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చెయ్యాలి అని భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎం వివి మురళీ మోహన్ కోరారు. గురువారం ఉదయం ఎంవిపి కాలనీలోని సెవెంత్ డె అడ్వెంటిస్ట్ విద్యా సంస్థ లో వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె. రాజేశ్వరి నేతృత్వంలో, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ ఏక్షన్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత పూర్తి స్థాయిలో కృషి చెయ్యాలి అని కోరారు. మొక్కలు నాటి పెంచాలని, అడవులు, కొండలు, గుట్టలు పరిరక్షణకు కృషి చెయ్యాలి అన్నారు . నదులు, వాగులు, సముద్రాల లోనికి హానికరమైన రసాయనాలు, భార లోహాలు, హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్ధాలు వెళ్లకుండా చూడాలని, ప్రజలను చైతన్య పరచాలని కోరారు.
సంస్థ కో ఆర్డినేటర్ జె రాజేశ్వరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విశాఖపట్నం లో పలు సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమాలు తాను స్వయంగా విద్యా సంస్థల్లో నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు.
సంస్థ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నాం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జితేందర్ సింగ్, టీచర్ స్వాతి సింగ్, ఎకో వారియర్ జెవి రత్నం, గ్రీన్ వాలంటీర్స్ జె. రవితేజ, ఐ. కృష్ణ కుమారి తదితరులు మాట్లాడారు.