నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి- సిపిఐ డిమాండ్
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఒక తీవ్రమైన సమస్యగా మారిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు తెలిపారు. పెరిగిన ధరలు అదుపులో పెట్టాలని మంగళవారం జీవీఎంసీ 7 వార్డు పరిధిలో మల్లయ్యపాలెం, అయోధ్యనగర్, కొత్తపాలెం ఏరియాలలో సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించిన కార్యక్రమంలో పైడిరాజు పాల్గొని మాట్లాడుతూ
కూరగాయలు, పప్పులు, బియ్యం, వంట నూనె, వంటగ్యాస్ వంటి కనీస అవసరమైన నిత్యావసర వస్తువులు ధరలు సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందన్నారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఈ ధరల పెరుగుదలను తీవ్రంగా నిరసిస్తూ, తక్షణమే ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదన్నారు.
ఇంధన ధరలు తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ మరియు డీజిల్పై ఉన్న పన్నులను తగ్గించి, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించవచ్చని, రైతులకు తగిన మద్దతు ధరలు ఇవ్వడం ద్వారా రైతుల ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడం అవసరమని ఇది మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గించి, ధరలను నియంత్రించడానికి సహకరిస్తుందని తెలిపారు. పౌర సరఫరా వ్యవస్థ ద్వారా తక్కువ ధరలకే ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం అత్యవసరమని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించి, ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాదని తెలిపారు.
వైసీపీ నాయకుడు అల్లాడ లింగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపిన ఈ ప్రచారంలో సిపిఐ నాయకులు ఎం డి బేగం, వి సత్యనారాయణ, కొల్లి భాస్కరరావు, కానూరి రామారావు, పి రమణ, కె చిన్న, ఎన్ త్రినాధ్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.