*అట్టహాసంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం*
అత్యధిక మెజార్టీ ఇచ్చారు- అభివృద్ధి చేసి చూపిస్తా:
హోం మంత్రి వంగలపూడి “అనిత ”
సెప్టెంబరు 20, పాయకరావుపేట:- రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన *ఇది మంచి ప్రభుత్వం* కార్యక్రమం పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆద్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ
పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. వందరోజుల పాలనపై ఇది మంచి ప్రభుత్వం అని కార్యక్రమం నిర్వహిస్తున్నామని,ఒక పండగ వాతావరణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.గతంలో ఫించను విషయంలో వృద్ధులను రోడ్లుపై నిలబెట్టారని, వాలంటీర్ లేకపోతే ఫించన్లు పంపిణి చేయలేమనే భావనలో గతంలో అధికారులు ఉన్నారన్నారు.
ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఒక్కరోజులో 90 శాతం ఫించన్లు ఇస్తున్నారని చెప్పారు. ఆదివారం సెలవు వస్తే,శనివారమే ఫించన్ పంపిణి చేసారని గుర్తుచేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను రద్దు చేయడమే కాకుండా
పోలవరం ప్రాజెక్ట్ కు అత్యధిక నిధులు తీసుకువచ్చిన ఘనత ఎన్డియే కూటమిది అన్నారు. పాయకరావుపేట మేజర్ పంచాయితీకి అన్నా క్యాంటీన్ మంజూరు చేస్తామని,సీఎం హామి ఇచ్చారని,రేషన్ డిపోలో పంచధార ఇవ్వమని చంద్రబాబు అధికారులను ఆదేశించారని తెలిపారు.
గత ప్రభుత్వంలో పంచాయితీలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామ పంచాయితీలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని స్పష్టం చేసారు. ప్రతీ గ్రామంలో సమస్యలు పరిష్కరించే దిశగా,గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, సోమవారం ఫిర్యాదుల బాక్స్ లు ప్రారంభిస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం-ప్రజా ప్రభుత్వమని, ప్రతి పౌరుడు గౌరవంగా జీవించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. విజయవాడ వరదలలో 74 సంవత్సరాల వయుస్సులో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడ్డారని, ప్రజల కోసం నిత్యం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను 2023 తర్వాత రెన్యువల్ చేయలేదని, మొన్న క్యాబినెట్ లో చర్చ జరిగిందని, త్వరలోనే గ్రామ వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పారు.
ఎన్డియే కూటమి ప్రభుత్వం వందరోజులు పూరైన సందర్భంగా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం మంత్రి నివాసం వద్ద హోం మంత్రి వంగలపూడి అనిత కేక్ కట్ చేసి,శుభాకాంక్షలు తెలిపారు.రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.