ఉద్దేశపూర్వకంగానే ఏయూ లో దళిత స్కాలర్లపై వివక్ష.* #vvwnews

by vvwnews.com

*ఉద్దేశపూర్వకంగానే ఏయూ లో దళిత స్కాలర్లపై వివక్ష.*
*-అంబేద్కర్ చైర్ స్కాలర్స్ కు సకాలంలో స్టైఫండ్ మంజూరు చేయాలి*
*నెలరోజులోగా సమస్య పరిష్కారం కాకుంటే ఉద్యమం తీవ్రతరం:-*
-అంబేద్కర్ ఇండియా మిషన్ అధినేత, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్

విశాఖపట్నం:-
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళిత రీసెర్చ్ స్కాలర్ లమీద ఏయూ యాజమాన్యం వేధింపులకు దిగడం, ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అంబేద్కర్ ఇండియా మిషన్ అధినేత, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సునీల్ కుమార్ ఏయులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల చేతిలో కుల వివక్షతకు వేధింపులకు
గురైనటువంటి
ఏయూ అంబేద్కర్ చైర్ ఫెలోషిప్ స్కాలర్ లు అయిన ప్రవీణ్ కుమార్, మరో స్కాలర్ రాజ్ కుమార్ ను కలుసుకొని
జరిగిన విషయాలపై వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖ, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఇచ్చే నిధులను
ఏయూ ఉన్నతాధికారులు ఇక్కడ ఈ స్కాలర్స్ కు ఇవ్వకుండా వేధించడం దుర్మార్గమన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉన్నటువంటి అంబేద్కర్ చైర్ లోని స్కాలర్స్ కు కేంద్రం ఇచ్చే స్టైఫండు సకాలంలో అందజేస్తుండగా ఒక ఏయూలోనే వివక్షత చూపించడం జరుగుతోందన్నారు. అంబేద్కర్ ఫౌండేషన్ ఇచ్చే నిధులు
వారం రోజుల్లోనూ పది రోజుల్లోనో ఇక్కడ స్కాలర్ స్కూల్ స్టైఫెండ్ గా ఇవ్వాలని, కానీ ఆరు నెలల పాటు వారికి ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వకుండా ఏయూ అధికారులు వేధింపులకు దిగడం బాధాకరమన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవీణ్ కుమార్ ఏయూ వీసీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ ను పలుమార్లు కలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎలాగోలాగా ఒకసారి వీసీను కలుసుకోగా నీకు స్టైఫండ్ ఇచ్చేది లేదని, యూనివర్సిటీలో డాక్టర్ అంబేద్కర్ చైర్ తొలగిస్తున్నట్టు వీసీ పేర్కొనడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. యుటలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని, తద్వారా తరువాత కాలంలో వచ్చే నిధులను అడ్డుకునే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.
డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ నుంచి మనోజ్ తివారి అనే అధికారి అనేకమార్లు ఏయు ఉన్నతాధికారులకు ఈ స్కాలర్సుకు స్టైఫండ్ చెల్లించే విషయంలో లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.
75 ఎకడమిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, పది పుస్తకాలు ప్రచురణ, 34 పేటెంట్లతో దేశంలోనే ఏయులోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చైర్ ఉత్తమ పనితీరు కనబరుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
దళితులను కావాలనే వేధించడం తగదని, ఏదో యూనివర్సిటీ సొంత సొమ్ము ఇస్తున్నట్టు వీసీ ప్రవర్తించడం తగదని, అంబేద్కర్ ఫౌండేషన్ ఇచ్చే నిధులు తొక్కిపెట్టే అధికారం ఇతనికి ఎక్కడదని ప్రశ్నించారు. అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మహిళ అధికారులను, ఆచార్యులను విశాఖ జిల్లాలోని పనిచేస్తున్న విజిలెన్స్ సిఐ అడారి సంతోష్ కుమార్ అనే విజిలెన్స్ అధికారి ఎస్సీ ఎస్టీ మహిళ అధ్యాపకులను విచారణ పేరుతో తన కార్యాలయంలో రాత్రి తొమ్మిది నుంచి పది వరకు ఉంచి వేధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆ అధికారి తన ప్రవర్తన మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ అడారి సంతోష్ కుమార్ అనే విజిలెన్స్ అధికారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
ఈ అంశాలన్నిటిపై ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, విచారణ కూడా కొనసాగుతుందని తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని ఆశ భావం వ్యక్తం చేశారు.
ఏయు ఉన్నతాధికారులకు ఒక నెలరోజులు టైం ఇస్తున్నామని ఈ లోగా జరిగిన తప్పును సరిదిద్దుకొని అంబేద్కర్ చైర్ డాక్టరల్ ఫెలో యాడాల ప్రవీణ్ కుమార్ కు న్యాయం చేయకుంటే, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేయనున్నట్టు సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బాధిత స్కాలర్లు ప్రవీణ్ కుమార్, రాజ్ కుమార్ తో పాటు మరో స్కాలర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles