విత్తన బంతులతో పచ్చదనం పరిడవిల్లాలి
– ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి
– ప్రతి ఒక్కరూ ఆరగించిన పండ్ల విత్తనాలు అటవీ శాఖకు అందజేయండి
– దేశీయ విత్తనాలు సేకరించడం అవసరం
– ఐకెవి రాజు, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, విశాఖపట్నం
విత్తన బంతులు తో పచ్చదనం పరిడవిల్లాలి అని విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐకెవి రాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కంబాల కొండ లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేయడం మీద శిక్షణ ఇచ్చారు. అనంతరం రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. ఈ రోజు శీతోష్ణస్థితి వేడెక్కడం వలన అందరికీ ఇబ్బంది ఏర్పడింది అని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురిసే సమయం లో విత్తనాల బంతులు కొండల్లో, మైదాన ప్రాంతంలో, తీర ప్రాంతంలో విస్తృతంగా విత్తనాల బంతులు చల్లవలసిన అవసరం ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరగించిన పండ్ల విత్తనాలు అటవీ శాఖకు అందజేయండి అని పిలుపునిచ్చారు. దేశీయ విత్తనాలు సేకరించడం అవసరం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ అడవులు పుడమి మీద జీవిస్తున్న అన్ని జీవులకు ఊపిరి అందిస్తాయి అని వివరించారు. ప్రతి ఒక్కరూ 70 శాతం పచ్చి పేడ (ఒకటి రెండు రోజుల నాటిది), 30 శాతం ఒండ్రు తో ఉన్న ఇసుక మట్టి మిశ్రమాన్ని చపాతీ పిండి తరహా లో కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒకే రకమైన విత్తనాలు మూడు వంతున పెట్టి ఉండ చేయడం ద్వారా విత్తనాల బంతులు తయారు అవుతాయి అని వివరించారు. తయారు అయిన విత్తనాల బంతులు మూడు రోజులు ఆరబెట్టాలి అని పేర్కొన్నారు. సీడ్ బాల్స్ గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి అని కోరారు. అయితే గడ్డి గాదం ఉండరాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ వుమెన్స్ డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాణిక్య కుమారి, డిఎఫ్ఒ సోమసుందరం, పాడేరు డిఎఫ్ఒ ఉమామహేశ్వరి, పార్వతీ పురం డిఎఫ్ఒ ప్రసూన, చింతపల్లి డిఎఫ్ఒ నరసింహారావు, అనకాపల్లి డిఎఫ్ఒ శ్యామ్యూల్, స్క్వేడ్ డిఎఫ్ఒ సునీల్ కుమార్, విశాఖపట్నం సబ్ డిఎఫ్ఒ శ్రీవాణీ తదితరులు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రేంజర్ లు, ఇతర అధికారులు, సిబ్బంది నాలుగు వందల మందికి పైగా పాల్గొన్నారు.
విత్తన బంతులతో పచ్చదనం పరిడవిల్లాలి #vvwnews
1