ఎస్‌బీఐ ఉద్యోగుల నిశ్శబ్ద నిరసన
• డిమాండ్లు పరిష్కరించకుంటే దేశవ్యాప్త సమ్మెకు హెచ్చరిక
ఆల్ ఇండియాc స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సిరిపురం బ్రాంచ్ వద్ద బ్రాంచ్ మేనేజర్ ఏ.ఎస్.వి. నాగేశ్వరరావు అద్వర్యం లో ఎస్‌బీఐ ఉద్యోగులు నిశ్శబ్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ. సుష్మ మాట్లాడుతూ ఉద్యోగుల 16 ప్రధాన డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలపై స్పందన లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మే 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు అఖిల భారత స్థాయి బ్యాంకు సమ్మెకు వెళ్తామని తెలిపారు. 2019 తరువాత నియమితులైన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం కల్పించడం, తాత్కాలిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మహిళా ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడం, టీనెంట్ సబ్సిడీ పెంపు, బ్యాంకులో మానవతా సమన్వయం వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా కేరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ అమలు, 10వ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ సవరణలు, 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న కన్వేయన్స్ ఛార్జీల చెల్లింపు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకంలో మార్పులు, పెన్షన్‌దారులకు న్యాయం చేయాలని సంఘం డిమాండ్ చేసింది. హెచ్‌ఆర్‌ఎంఎస్ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించాలని, క్రాస్ సెల్లింగ్ ఒత్తిడులను తగ్గించాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ విశాఖపట్నం మాడ్యూల్ డీజీఎస్ ఉపాధ్యక్షుడు పి. సతీష్ పాల్గొన్నారు. ఎస్‌బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి.ఏ. కోటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. సమారు 200 ఉద్యోగులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.