జ్ఞానాపురం రామమూర్తి పంతులుపేటలో వెలసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కమిటీ అధ్యక్షులు మద్దాల వెంకట అప్పారావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రధాన పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మీడియాతో మాట్లాడుతూ సోమవారం తోలేళ్లు పండగ వైభవంగా జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు, 56వ వార్డ్ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్ ఇతర పెద్దల సహాయ సహకారాలతో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడిమాంబ అమ్మవారని, అమ్మవారి ఆశీస్సులతో చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో వెలుగుతున్నారన్నారు. ఈ నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసు, రైల్వే శాఖ ఎంతో సహాయ సహకారాలు అందించాయని, సంబంధిత అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్సవాల్లో మారువరం ఈ నెల 17న మధ్యాహ్నం సుమారు 7000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
జ్ఞానాపురం రామమూర్తి పంతులుపేటలో వెలసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు
9