పోషకాహారంతోనే రక్త హీనత నివారణ సాధ్యం..
పోషకాహారంతోనే రక్త హీనత నివారణ సాధ్యమని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కుమార్తె బిజేపీ నాయకులు శ్యామల దీపిక అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిధి తాటి చెట్ల పాలెం జంక్షన్ వద్ద నున్న కమ్యూనిటీ హాల్ లో ఐసిడిఎస్ విశాఖ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ఆమె గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు నిత్యం తీసుకునే ఆహారంలో పోషక శక్తి అధికంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాల నుండి అందిస్తున్న పోషకాహారాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ఆమే పరిశీలించారు. అర్బన్ సిడిపిఓ నీలి మాట్లాడుతూ పౌష్టిక ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీ బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కంపా హనుక్, ఐసిడిఎస్ సహాయక సిడిపిఓ శ్రీలత, మర్రిపాలెం సెక్టర్ సూపర్ వైజర్ జె టి ఎన్ జ్యోతి అంగన్వాడి టీచర్ లు పెద్ద సంఖ్యలో గర్భిణీలు పాల్గొన్నారు.