– విశాఖను ప్రజలే కాపాడుకోవాలి
– అదానీ గూగుల్ సెంటర్ వల్ల వచ్చేవి 500 ఉద్యోగాలే
– ఐపీఎస్ విశ్రాంత అధికారి ఏ.బీ.వెంకటేశ్వరరావు
– “తెలుగు శక్తి” మేధోమధనం సమ్మేళనం విజయవంతం
విశాఖపట్నం: తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆధ్వర్యంలో శనివారం హోటల్ మేఘాలయ వేదికగా నిర్వహించిన మేధోమధనం సమ్మేళనం కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథిగా మాజీ డిజిపి ఏ.బీ.వెంకటేశ్వరరావు .. మాట్లాడుతూ గతంలో మహానుభావుడు ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు అని భావించే వారన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు తమకు తామే దైవంగా భావించి ప్రజలను భక్తులుగా చూస్తూ వారి చేత చప్పట్లు కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వం చేసేది ఏమీలేదని విశాఖను మీకు మీరే పరిరక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాబందుల వంటి అదానీ, జిందాల్ సంస్థల బారి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్ట్ ట్రస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికుల పైనే ఉందన్నారు. అదానీ గూగుల్ డేటా సెంటర్ వల్ల కేవలం 500 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని.. కానీ విశాఖ ప్రజలపై భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తే పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. 99 పైసలకే ఎకరా భూమిని అప్పగించడం తప్పు కాదని.. కానీ ఒక ఎకరాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో ముందుగానే హామీ తీసుకొని అప్పుడు భూములను సదరు సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేందుకు రుషికొండ ప్యాలెస్ ను రూ.500 కోట్లతో గత ప్రభుత్వ నిర్మించిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా వదిలేయడాన్ని వెంకటేశ్వరరావు తప్పు పట్టారు. కనీసం తాత్కాలికంగా అయినా కేజీహెచ్ సూపర్ స్పెషాలిటీ వార్డు కోసమో, లేదా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ కోసమో ఋషికొండ ప్యాలెస్ కేటాయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలోని ఇరిగేషన్, రైతుల సమస్యలపై అధ్యయనం చేస్తూ వివిధ వర్గాల ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని ప్రస్తావించారు. ఆంధ్ర యూనివర్సిటీ కి కులాల ప్రాతిపదికన వైస్ ఛాన్స్లర్లను నియమించడం సరికాదన్నారు. ప్రపంచంలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను వెతికి తీసుకువచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వీసీగా నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంవత్సరానికి 15 శాతం ఆస్తి పన్ను పెంచడం వలన మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఇదిలా ఉండగా కార్మిక నేత అప్పలరాజుపై పిడి చట్టం పెట్టి అరెస్టు చేయడం అప్రజా స్వామికమన్నారు.
*ఆయనతో ఎలాంటి పరిచయాలు లేవు: బి.వి.రామ్*
కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మాట్లాడుతూ.. ఐపీఎస్ విశ్రాంత అధికారి వెంకటేశ్వరరావుకు తనకు గతంలో ఎలాంటి పరిచయాలు లేవన్నారు. అయినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తను ఆహ్వానించడం వెంటనే అంగీకరించడం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయనకు జ్ఞాపక అందజేసి శాలువతో సత్కరించారు.
భారీగా ప్రజలు తరలివచ్చి వాళ్ళ ఆవేదన ఆయనకు వెళ్లబుచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏయూ మాజీ ప్రొఫెసర్ పెంటకోట త్రినాధరావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి, ఆడారి కిషోర్ కుమార్,డాక్టర్ పప్పూర్ నికుంజ్ తదితరులు పాల్గొన్నారు.