*ప్రతి రోజూ ఒక సేవా కార్యక్రమం చేపట్టండి*
*ఆత్మ సంతృప్తితో ఆనందమయ జీవనం*
*-రాజయోగతో మానసిక ప్రశాంతత*
*బ్రహ్మకుమారీస్ సేవలు ప్రశంసనీయం
–క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో సీపీ శంఖబ్రతబాగ్చీ**
డాబాగార్డెన్స్, డిసెంబర్24:
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మ సంతృప్తితో ఆనందమయ జీవనం గడపాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పిలుపునిచ్చారు. మంగళవారం డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్మిస్మస్, నూతన సంవత్సర వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీ బాగ్చీ మాట్లాడుతూ ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలన్నారు.అది ధనంతోనే ముడిపడాల్సిన అవసరం లేదని ఏ రూపంలోనైనా మన ద్వారా మరొకరికి సహయం అందించవచ్చునన్నారు. అలా సహయం అందించడానికి తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని జర్నలిస్టులు కూడా అదే రీతిన సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చునన్నారు. ఎవరి పరిధిలో వారు ఇతరులకు సహయం చేసి కావాల్సినంత ఆత్మ సంతృప్తి పొందవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలంటే సక్రమమైన మార్గంలో ఆదాయం సంపాదించుకోవడంతో పాటు, ఆత్మ సంతృప్తి కోసం రాజయోగ ద్వారా ధ్యానం అలవర్చు్కోవాలన్నారు. ఈ రెండు అంశాలతో అందరూ సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. బ్రహ్మకుమారీస్ చేపడుతున్న సేవలు ఎంతో మందికి స్పూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరికీ మనం జీవించే విధానం ఆదర్శనీయంగా ఉండాలన్నారు. గౌరవ అతిధిగా హాజరైన విమ్స్ డెరెక్టర్ డాక్టర్ కె,రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, దయతో ముందుకు సాగాలన్నారు. వైద్య పరంగా జర్నలిస్టులకు తన వంతు సహయసహకారాలు అందిస్తామన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకులు నిర్వహించుకోవడం అందులో తనను భాగస్వాములను చేయడం సంతోషం కలిగిస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన సింహాచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక భక్తిభావంతో ముందుకు సాగాలన్నారు. బ్రహ్మకుమారీస్ ద్వారా జర్నలిస్టులకు సంబంధించి అనేక పండుగలు నిర్వహించుకోవడం అందులో అందరూ భాగస్వాములు కావడం ఎంతో సంతోషదాయకమన్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు బ్రహ్మకుమారీస్ ప్రతినిధి బికె రామేశ్వరి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచమంతా శాంతిమయ జీవనం గడపాలన్నదే తమ సంస్థ ఆకాంక్షగా పేర్కొన్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పరమాత్ముడి ఆశీస్సులు ఉంటాయన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకులు జర్నలిస్టుల మధ్య నిర్వహించడం తమకు ఆనందం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన సీనియర్ పాత్రికేయులు, స్కూల్ ఆఫ్ ధియేటర్ ఆర్ట్స్ నిర్వాహకులు ఆర్. నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల జీవనస్థితిగతులను విపులంగా తెలియజేశారు. ఎంతో మంది సీనియర్ ప్రాతిక్రేయులు ఆత్మ విశ్వాసంతో జర్నలిజంలో కొనసాగుతున్నారని, అయితే వారిని ఆదుకోవడానికి అన్ని వర్గాలు తగిన రీతిలో సహాయం అందించాలన్నారు. అలాగే జర్నలిస్టులు కూడా జర్నలిజంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తే ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్‌ను అతిథుల చేతుల మీదుగా కట్ చేసి 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. అతిధులు. జర్నలిస్టులు, బ్రహ్మకుమారీస్ ఒకరికి ఒకరు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.