గడచిన మూడు నెలల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే పనిచేశామని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ అన్నారు. బుధవారం నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నుండి రెండు సార్లు సుమారు 17 వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకుని వచ్చామని, గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఇలా నిధులు తీసుకుని వచ్చారా అని ప్రశ్నించారు. వైకాపా నేతలు విమర్శలు చేయడం మాని, సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పై కేంద్ర స్టీల్ మంత్రులతో సమావేశం అయ్యారని చెప్పిన ఎంపీ, స్టీల్ ప్లాంటును కాపాడి లాభాల బాటలో నడపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా పనిచేస్తోందని చెప్పారు. ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయమని అన్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలపై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ లో రైల్వే జోన్ కి శంకుస్థాపన చేస్తున్నామని పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. మీడియా సమావేశంలో పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు గండి బాబ్జి, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గడచిన మూడు నెలల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే పనిచేశాము..ఎంపీ భరత్ #vvwnews
by vvwnews.com
written by vvwnews.com
52