పత్రికా ప్రకటన
ఎన్ ఫోర్స్ మెంట్ టీములు మరింత చురుకుగా పనిచేయాలి
@జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎ.మల్లిఖార్జున
పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్ వెల్లడి
విశాఖపట్నం, మార్చి 28 : సాధారణ ఎన్నికల కోసం జిల్లాలో నియమించిన వివిధ ఎన్ ఫోర్స్ మెంట్ టీములు మరింత చురుకుగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్ రిటర్నింగ్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులను ఆదేశించారు. సీజర్స్ చేయడంలో రాష్ట్రస్థాయిలో మన జిల్లా ముందు వరుసలో ఉండే విధంగా అధికారులు కృషిచేయాలని ఆకాంక్షించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎలక్షన్ సీజర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఈ.ఎస్.ఎం.ఎస్ ) పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ.ఎస్.ఎం.ఎస్ ద్వారా కేసులు నమోదు చేయడంలో మరింత పురోగతి కనిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఇప్పటివరకు రూ. 53.49 లక్షలు మాత్రమే సీజర్స్ ద్వారా నగదు పట్టుబడిందన్నారు. ఇందులో కొన్ని శాఖల నుండి ఎటువంటి కేసులు నమోదుకాలేదని, ఈ విషయంలో ఆయా నోడల్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ బృందాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ, పోర్టు ట్రస్ట్ , ఆదాయపు పన్ను, కస్టమ్స్, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్, స్టేట్ జి.ఎస్.టి శాఖల అధికారులు సీజర్స్ పై నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. అనుమానస్పదంగా ఉన్న ఏ ఒక్కదానిని విడిచిపెట్టవద్దని, సరైనా ఆదారాలు లేనిఎడల కేసు నమోదుచేయాలని ఆదేశించారు. ఇకపై ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే ఎం.సి.సి టీముల ద్వారా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచామని, వీటితో పాటు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, వి.ఎస్.టి, వి.వి.టిలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయన్నారు. పోలింగ్ స్టేషన్లు ఉన్న లొకేషన్లతో పాటు సమస్యాత్మక , సమస్యాత్మక లేని పోలింగ్ స్టేషన్లను ఆయా అధికారులు ముందుగానే పరిశీలించుకోవాలని తెలిపారు. మరో మూడు వారాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ రోజు నుంచి ఎం.సి.సి టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరింత చురుకుగా పనిచేయాలని పేర్కొన్నారు. రాజకీయ పక్షాల సమావేశాలు, ర్యాలీల కోసం సువిధా యాప్ నందు దరఖాస్తు చేసుకున్న 48 గం.ల్లోగా అనుమతులు మంజూరుచేయాల్సి ఉన్నప్పటికీ 24 గం.ల్లోనే అనుమతిని మంజూరుచేసేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికపుడు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఎట్టిపరిస్థితిల్లో పెండింగ్ ఉంచరాదని స్పష్టం చేశారు. పోలింగ్ విధులను నిర్వహిస్తూ ఓటు వేయలేని వారికోసం పోస్టల్ బ్యాలెట్ ఉందని, వాటికోసం ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. ఆయా నోడల్ అధికారులు కోరిన విధంగా ఫారం-12 లేదా ఫారం-12డిలను సరఫరా చేస్తామని, తద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో ఎం.సి.సి జిల్లా నోడల్ అధికారి మరియు జీవిఎంసి కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి కె.మోహన్ కుమార్, రిటర్నింగ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు, ఎస్ఈబి,పోలీస్, అటవీ, ఎక్సైజ్, పోస్టల్, ఆదాయపు పన్ను, ఎయిర్ పోర్ట్, సిఆర్పిఎఫ్, జిఎస్టి, రెవిన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్నం