ఉక్కు కార్మికులకు న్యాయం చేయకపోతే.. విశాఖ ప్రజలు ఉద్యమిస్తారు
బాధిత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలి
ప్రమాద స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఉంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే!
—- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం: ఉక్కు కార్మికులకు న్యాయం చేయకపోతే విశాఖ ప్రజలు ఉద్యమిస్తారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ప్రజాసంఘాలతో కలిసి ద్వారకా నగర్ లోని పౌర గ్రంథాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా బి.వి.రామ్ మాట్లాడుతూ.. నిజంగా విశాఖ ఉక్కు కార్మికుల పట్ల బాధ్యత ఉంటే తక్షణమే బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎక్కడ ప్రమాదం సంభవించిందో.. అక్కడ గంటపాటు ఉంటే కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏమిటో తెలుస్తుంది అన్నారు. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని సెక్యూరిటీతో వచ్చి వెళ్లిపోవడం కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నం ఉక్కు గుండె కాయ అని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కులో ఘోరమైన ప్రమాదం సంభవించి పది మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా రాకపోవడం శోచనీయమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని.. తక్షణమే స్టీల్ ప్లాంట్ కార్మికులకు తగిన భద్రత కల్పించాల్సిన అవశ్యకత ఉందని రామ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతలు చేస్తూ తెలుగు శక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఇప్పటికే ఫిర్యాదు చేసిందన్నారు. ఏది ఏమైనాప్పటికీ తెలుగు శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తము ఎప్పుడూ ఎవరు ఏ తప్పు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. తను ఎవరికీ భయపడేది లేదని ప్రజల క్షేమం కోసం పనిచేస్తామన్నారు.