కాంగ్రెస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ విరుచుకుపడ్డారు. జగదాంబ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాసిని వర్మ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం హాసిని వర్మ మాట్లాడుతూ.. సామాన్యుడి నడుం విరిచేలా ఇంధన ధరలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం ఎన్నికల వరకే ప్రజలను చూస్తాయి. అందుకే ఎన్నికలు అవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయని హాసిని వర్మ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.