*నాడు ఋషికొండ కోసం గగ్గోలు పెట్టి ఇప్పడేం చేస్తున్నారు*
*నేడు సింహాచలం భూముల జోలికి ఎందుకు వస్తున్నారు*
*ఋషికొండను టచ్ చేసిన వైసీపీ ఏం అయిందో తెలియదా..?*
*ఇప్పుడు సింహాచలం భూములను ఎందుకు గూగుల్ డేటా సెంటర్ కు ఇస్తున్నారు?*
—– *కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్*
విశాఖపట్నం: కేవలం 500 ఉద్యోగాలకు మాత్రమే పరిమితం అయ్యే గూగుల్ డేటా సెంటర్ కోసం కూటమి ప్రభుత్వం నానా ఆర్భాటం చేస్తోందని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ ఆరోపించారు. చివరకు దేవుడి భూములను కూడా గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే అంశమై పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబును ఆయన క్యాంపు కార్యాలయం పెందుర్తిలో మంగళవారం ఉదయం కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు ఋషికొండ ఎంతో పవిత్రమైనదని, అక్కడ ఋషులు తపస్సు చేసుకునే వారని, అటువంటి పవిత్రమైన కొండను తవ్వడం అపవిత్రమని అప్పట్లో ఘోషించిన వారు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి అని ప్రశ్నించారు? సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి చెందిన భూములను గూగుల్ డేటా సెంటర్కు కట్ట పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నాడు ఋషులు తపస్సు చేసుకునే కొండను టచ్ చేసిన వైసీపీ ప్రభుత్వం గతి ఏమైందో అందరికీ తెలిసిందేనని ప్రస్తావించారు. మరి సింహాచలం వారాహ లక్మీ నృసింహ స్వామి భూముల జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో పాలకులే అంచనా వేసుకోవాలని హితవు పలికారు.
*నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ స్థాయి మరీ అంత తక్కువ?*
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనకు బాగా తెలుసునని.. తాను ఎంత చెపితే అంత అంటూ.. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడి పల్లా శ్రీనివాస్ బంధువు మరియు పీ.ఏ గా ఉన్న మురళి హడావిడి చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన పల్లా శ్రీనివాసరావు
పుట్టినరోజు కోసం వివిధ సంస్థలు / వ్యక్తుల పైన మురళి ఒత్తిడి చేశారన్నారు. ఆ ఫలితంగానే ఎక్కడ చూసినా పల్లా శ్రీనివాసరావు జన్మదిన బ్యానర్లు, హార్డింగ్స్ ఇబ్బడి ముబ్బడిగా వెలసాయన్నారు. అంతే కాకుండా..రాబోయే మహానాడు కార్యక్రమం కూడా తన అదుపు ఆజ్ఞలలో ఉంటుందని మురళి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అంటే.. మురళి లాంటి వ్యక్తుల చెపితే వినే విధంగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్థాయి మరీ అంత తక్కువగా ఉందా అని రామ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు 2019-2024 సంవత్సరాల మధ్య మురళి అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారని రామ్ ప్రశ్నించారు?.
ఈ కార్యక్రమంలో కోడే బాబురావు, కే.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.