*మతం మారితే కులం మారదు..*
*దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి*
*క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ*
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను వెంటనే రద్దు చేయాలని క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమాఖ్య డిమాండ్ చేసింది. “మతం మారితే కులం మారదు” అంటూ శుక్రవారం వాల్తేరు సెమెట్రీ నుంచి జగదాంబ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సమాఖ్య వ్యవస్థాపకుడు జేమ్స్ వీకే కుంపట్ల మీడియాతో మాట్లాడుతూ.. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కారణంగా వారికి ఎస్సీ హక్కులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కుల, మత వివక్షకు దారితీసే విధంగా అమలులో ఉన్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు సమాన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘క్రైస్తవ హక్కుల విజ్ఞాపన-2026’ పేరుతో ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, శాంతియుతంగా ప్రార్థనా మందిరాలు నిర్వహించుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించాలని, క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ప్రార్థనా మందిరాలకు సంబంధించిన స్కెచ్ కో ఆర్డర్ వివరాలను విడుదల చేయాలని, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు చేసిన విద్వేష వ్యాఖ్యలపై విచారణ జరిపి మత కలహాలను అరికట్టాలని కోరారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జీఎస్ ప్రశాంత్ కుమార్, సుధాకర్ పాల్, హనీ జాన్సన్, ఈశ్వర్ డానియల్, పాల్ ప్రసాద్, జాన్ ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. మాజీ ఐఏఎస్ అధికారి జి. విజయ్ కుమార్, ఆర్‌ఎంపీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రంజిత్ ఓఫీర్, మాజీ సెనేటర్ పీఎంసీపీ ప్రెసిడెంట్ రోలాండ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.