నా స్వార్థం కోసం చెబుతున్నానని అనుకోవద్దు.. క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు”#vvwnews

by vvwnews.com

విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ.. రైల్వే జోన్ ఏర్పాటు అనేది సున్నితమైన అంశమని, పరిపాలనపై అవగాహన లేకుండా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, నిధులు అందించిందని పేర్కొన్నారు. 1947 నుంచి 2014 వరకు రాష్ట్రానికి ఒక్క శాతం మాత్రమే అభివృద్ధి జరిగిందని, కానీ గత 12 ఏళ్లలో పూర్తి స్థాయి అభివృద్ధి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వాల్తేర్ డివిజన్‌కు విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్పు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రూ.1.06 లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. రైల్వే శాఖకు ప్రత్యక్ష ఆదాయం లేకపోయినా కేంద్రం అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయిస్తోందని అన్నారు. రాజమండ్రి-విశాఖ మధ్య నాలుగు లైన్ల ఏర్పాటుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

ఈ అభివృద్ధి పనులకు వైసీపీ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన శ్రీ భరత్.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. “నా స్వార్థం కోసం చెబుతున్నానని అనుకోవద్దు.. క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు” అని వ్యాఖ్యానించారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ భవిష్యత్తుపై కూడా శ్రీ భరత్ స్పందించారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఏవియేషన్ యూనివర్సిటీతో పాటు భారీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తయ్యాక ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం 25 లక్షల జనాభా ఉన్న విశాఖ భవిష్యత్తులో కోటి జనాభా నగరంగా మారే దిశగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌లో ఆరు ఔటర్ రింగ్ రోడ్లు వేసినా జనాభా పెరుగుదలతో ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతున్నాయని ఉదాహరణగా పేర్కొంటూ.. “మా విశాఖ నగరాన్ని తాకట్టు పెట్టం. గెలుపోటములతో మాకు సంబంధం లేదు” అని స్పష్టం చేశారు. గూగుల్ డేటా సెంటర్ కారణంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖపై ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. 2028 నాటికి పోలవరం నీరు విశాఖకు అందుతుందని, నగరానికి నీటి కొరత ఉండదని ధీమా వ్యక్తం చేశారు.

ఇక బీజేపీ విశాఖ అధ్యక్షుడు పరశురామ్ రాజు మాట్లాడుతూ.. రైల్వే జోన్ అంశాన్ని పార్లమెంట్‌లో మొదటగా బీజేపీనే ప్రస్తావించిందన్నారు. 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ఎంపీలు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. 2019లో చంద్రబాబు నాయకత్వంలో రైల్వే జోన్ ప్రకటన జరిగిందని గుర్తు చేశారు.

రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు జనరల్ మేనేజర్ నియామకం కూడా జరిగిందని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందని, కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 87 స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే కోల్‌కతా-చెన్నై మార్గంలో వందే భారత్ రైళ్లకు బెర్త్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

జనసేన నాయకుడు శివ మాట్లాడుతూ.. రైల్వే జోన్ సాధనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని అన్నారు. రైల్వే జోన్ కోసం కృషి చేసిన ప్రధాని మంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లకు అభినందనలు తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles