సిపిఐ ప్రెస్ నోట్
25-03-2026
బుధవారం, జీవీఎంసీ
7 వ వార్డు, మధురవాడ, కళానగర్ 61 వ సచివాలయం.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి – సిపిఐ డిమాండ్.
ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అర్హులైన పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చెయ్యాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు.
సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ 7 వ వార్డు మధురవాడ కళానగర్ 61 వ సచివాలయం వద్ద దరఖాస్తులు చేసుకున్న పేదలతో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించబడుతోందని విమర్శించారు. ముఖ్యంగా టిడ్కో ప్రాజెక్టు కింద 2014లో ప్రారంభించిన ఇళ్ళ నిర్మాణం ఇప్పటికీ పూర్తి స్థాయిలో లబ్దిదారులకు అందించలేదని, ఉగాది నాటికి ఇళ్ళు అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీ అమలు కాలేదన్నారు. పండుగల పేరుతో కాలయాపన చేయడం పేద ప్రజలను మభ్యపెట్టడమే అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ళస్థలాల మంజూరులో వివిధ షరతులు విధిస్తూ జీవో 23 ద్వారా ఆలస్యం చేయబడుతోందని, మీరు హామీ ఇచ్చినట్టు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ళ స్థలాలను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.
అంత్యోదయ పథకం ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 30% కుటుంబాలు దారిద్రయ రేఖ కింద జీవిస్తున్నాయని, అటువంటి కుటుంబాలకు నివాసం కల్పించడం ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యతని, ఇళ్ళు లేని పేద కుటుంబాలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం అద్దె ఇళ్ళలో నివసిస్తున్న వారికి ఇళ్ళు కేటాయించే వరకు అద్దెను ప్రభుత్వమే అద్దె భరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల ఆర్థిక సహాయం సరిపోవడం లేదని, నిర్మాణ సామాగ్రి ధరలు, కూలీల వేతనాలు పెరిగిన నేపథ్యంలో కనీసం రూ. 5 లక్షల సహాయం అందించాలని కోరుతున్నామని తెలిపారు. గత మూడు బడ్జెట్లలో ఈ అంశంపై సరైన నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, అర్హులైన వారిని వెంటనే గుర్తించి వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న పెన్షన్లను తగ్గించడం ఆందోళనకరమనిషి, గత రెండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగించబడిన విషయం గమనార్హమన్నారు.
దివ్యాంగులకు పెన్షన్ల మంజూరులో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఇప్పటికీ అమలు కాలేదని, ఈఅంశాలన్నింటిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి పేద ప్రజలకు న్యాయం చేయవలసిందిగా సిపిఐ తరఫున డిమాండ్ చేశారు. అనంతరం కలానగర్ 61 వ నెం సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి శ్రీమతి లూర్డు గారికి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆందోళన లో ఎపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎం డి బేగం, డి కైలాష్, కె రాం మహేష్, పి రమణ, వరలక్ష్మి, డి లక్ష్మి, తదితరులు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.