*ప్రెస్ నోట్*
*పోరాడేవారంటే పాలకులకు భయం*
*శ్రామిక ఉత్సవ్ లో బహు భాషా సినీ నటి రోహిణి*
సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలకవర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ 18 వ మహసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎయు ఎగ్జిబిషన్ మైదానంలో “శ్రామిక ఉత్సవ్” నాలుగో రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావముందన్నారు. పెరియార్, అణ్ణా, అంబేద్కర్, కమ్యూనిష్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. అధికారం చలాయించాలనుకున్న వారు స్త్రీలను కూడా తమ అదుపులోనే ఉంచాలనుకుంటారని పేర్కొన్నారు. సినీ నటిగా నాలుగు మంచి విషయాలు తన వాళ్ల కోసం తెలపాలని తన ఉద్దేశమన్నారు.
దైవీకం వంటి నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటుడు, “మా” ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని సూచించారు. నిరంతరం ప్రజా చైతన్యానికి కృషిచేస్తున్న ప్రజా కళాకారులు మరింతగా చేరువవ్వాలని భావించారు. వైద్యుడు శరీరానికి మాత్రమే వైద్యం చేస్తారని ప్రజా కళాకారులు సమాజ రుగ్మతల్ని పారద్రోలడానికి పాటుబడతారన్నారు. దురదృష్టవశాత్తూ విద్య, వైద్యం వ్యాపారమయం అయ్యాయని రవి ఆందోళన వ్యక్తం చేశారు. “ఉత్తరాంధ్ర గద్దర్” వంగపండు ప్రసాదరావు తనయుడు దుష్యంత్ తన తండ్రి పాటలను ఆలపించి సభను రంజింపజేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళీ మాట్లాడుతూ రాష్టం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పలు రూపాల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి అట్టాడ అప్పలనాయుడు, సిఐటియు నాయకులు బేబిరాణి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.