శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.
“వైకుంఠ ఏకాదశికి” ముస్తాబైన సింహగిరి – రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం.
సింహాచలం:27 డిసెంబర్ 2025
ఈ నెల 30వ తేదీన జరగనున్న అత్యంత పవిత్రమైన “వైకుంఠ ఏకాదశి” పర్వదినాన్ని పురస్కరించుకుని, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ యంత్రాంగం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది.
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా సింహగిరి పైన అద్భుతమైన ద్వీపాలంకరణలు చేపట్టారు. భక్తులను కనువిందు చేసే విధంగా
రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆలయ రాజగోపురం, ప్రాకారాలు మరియు గాలిగోపురాలు విభిన్న రంగుల విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. రాత్రి వేళల్లో కొండపైన వెలిగిపోతున్న ఆలయం సాక్షాత్ వైకుంఠాన్ని తలపిస్తోంది.
గర్భాలయం మరియు ఉత్తర ద్వార మార్గాలను సువాసనలు వెదజల్లే స్వదేశీ పుష్పాలతో అద్భుతంగా అలంకరిస్తున్నారు.
వైభవంగా ఉత్తర ద్వార దర్శనం
30వ తేదీ తెల్లవారుజాము నుంచే స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ల పొడవునా ప్రత్యేక అలంకరణలు చేశారు.
ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర ఘడియల్లో భక్తులు క్రమశిక్షణతో స్వామి వారిని దర్శించుకుని, ఆలయ పవిత్రతను కాపాడవలసిందిగా కోరడమైనది. పెరిగిన రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు జరుగుచున్నవి.