శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం
సింహగిరిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.
సింహాచలం డిసెంబర్ 25, 2025:
భారత కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం నాడు సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. సుజాత గారి ఆదేశాల మేరకు, దేవస్థాన అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ పర్యవేక్షణాధికారి కె. వెంకటేశ్వరరావు స్వయంగా మంత్రి గారికి స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి ముందుగా భక్తుల నమ్మకమైన, కోర్కెలు తీర్చే “కప్పస్తంభాన్ని” అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, రైతాంగం బాగుండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు.
దర్శనం అనంతరం ఆలయ ఆస్థాన వేద పండితులు మంత్రి కి వేద మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను ఘనంగా సత్కరించి, అప్పన్న ప్రసాదాలను అందజేశారు.
జ్ఞాపికగా స్వామివారి దివ్య స్వరూపంతో కూడిన పటాన్ని మంత్రికి బహుకరించారు.