*జగన్ హయాంలో రాష్ట్రం అధోగతి…విజనరీ లీడర్ చంద్రబాబు పాలనలో అభివృద్ధి పునఃప్రారంభం*

by vvwnews.com

*విజనరీ చంద్రబాబు నాయుడి దూరదృష్టికి నిదర్శనం*

*జగన్ హయాంలో రాష్ట్రం అధోగతి…విజనరీ లీడర్ చంద్రబాబు పాలనలో అభివృద్ధి పునఃప్రారంభం*

*–టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*విశాఖపట్నం, డిసెంబర్ 13:* విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం మాత్రమే కాదు… రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కేంద్రబిందువుగా భావించే దూరదృష్టి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER) ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి చరిత్రాత్మక మలుపని పేర్కొన్నారు.

నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన విశాఖ ఎకనామిక్ రీజియన్ తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం జరగడం అభివృద్ధి ప్రయాణానికి బలమైన పునాది అని పల్లా గారు తెలిపారు. సీఎం గారు స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కీలక మంత్రులతో ప్రత్యేక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం ఆయన పాలనా నిబద్ధతకు నిదర్శనమన్నారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహణతో విశాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని చెప్పారు.

సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన విశాఖ ఎకనామిక్ రీజియన్, నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ రీజియన్ పరిధిలో ఏడూ గ్రోత్ సెక్టర్లు, 49 కీలక ప్రాజెక్టులు అమలులోకి రానున్నాయని, 2031 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

2019–2024 మధ్య జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధ్వంసకర పాలన సాగిందని పల్లా గారు తీవ్రంగా విమర్శించారు. ఐటీ కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమివేయడం, అభివృద్ధి స్థానంలో కూల్చివేతలకే పరిమితమైన పాలన జరగడం వైసీపీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పేదల కోసం 5 రూపాయలకే భోజనం అందించిన అన్న క్యాంటీన్లను కూడా మూసివేయడం ఆ పాలనలోని అమానుషత్వాన్ని చూపిస్తుందని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించాల్సిన సమయంలో వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

విశాఖకు రైల్వే జోన్ రావడం, ప్రైవేటీకరణ అవుతుందనే అపోహలు సృష్టించిన స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచే కాకుండా రాష్ట్రం నుంచీ నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వ కృషి ఫలితమని పల్లా గారు తెలిపారు. ఐటీ సంస్థలకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నారని విమర్శలు చేసే వారు గతాన్ని గుర్తు చేసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎకరం భూమిని ఒక రూపాయికే కేటాయించిన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం తక్కువ ధరకు భూములు కేటాయించడం కొత్త కాదని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న కన్వేయర్ బెల్ట్ ఘటనలపై విచారణ కొనసాగుతోందని, నివేదికల ఆధారంగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పల్లా గారు తెలిపారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని, ఎవరైనా బాధ్యులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ప్రభుత్వం ముందువరుసలో ఉంటుందని, యాజమాన్యం, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే విజిలెన్స్ విచారణ చేపట్టి, సమర్థవంతమైన అధికారులను నియమించి స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

విధ్వంసకర వైసీపీ పాలనతో అధోగతిపాలైన ఆంధ్రప్రదేశ్‌ను, విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో మళ్లీ అభివృద్ధి పథంలో నిలిపామని పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలను కచ్చితంగా సాధించి, విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను రాష్ట్ర ఆర్థిక ఇంజిన్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles