మున్సిపల్ కార్మికుల బిడ్డలకే ఉపాధి కల్పించాలి
పనిముట్లు కార్మికుల డబ్బులతో కొనిపించడం అన్యాయం.
జివిఎంసి జోన్‌త్రీ కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా
జివిఎంసిలో పనిచేస్తున్న (ఆప్కాస్‌లో ఉన్న) కాంట్రాక్ట్ కార్మికులు 30సం॥లు పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికులకు, అకాలమరణం పొందిన కార్మికులకు, అనారోగ్యం పాలై వైద్యం పొందుతున్న కార్మికుల కుటుంబాల బిడ్డలకే ఉపాధి కల్పించాలని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆర్గనైజ్ సెక్రటరీ వి.కృష్ణారావు డిమాండ్ చేసారు.
ఆశీలమెట్ట వద్ద ఉన్న జివిఎంసి జోన్ త్రీ కార్యాలయం ఎదుట జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో కృష్ణారావు మాట్లాడుతూ నగర జనాభా పెరుగుతున్నా కార్మికుల సంఖ్య పెరగటం లేదన్నారు. నలుగురు పనిచేయాల్సిన దగ్గర ఒకరితో చేయించడం సరికాదన్నారు. 60ఏళ్ళు దాటినవారు, చనిపోయినవారు, అనారోగ్యం పాలైన కార్మికుల పోస్టులు ఖాళీలున్నప్పటికీ వాటిని భర్తీచేయడం లేదన్నారు. 2023 ఆగష్టులో నాటి కమీషనర్ వ్రాతపూర్వకంగా మినిట్స్ రూపంలో ఒప్పందంలో కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి దానిని తుంగలో తొక్కారన్నారు. మరోవైపు కార్మికులకు పనిముట్ల, సేప్టీ పరికరాలు ఇవ్వకుండా కార్మికుల డబ్బులతోనే చీపుర్లు వంటివి కొనిపించడం జివిఎంసికే అవమానకరమన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ఓట్ల కోసం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇస్తున్నా వాటిని అమలు చేయడం లేదన్నారు. గత వైసిపి ప్రభుత్వం పర్మినెంట్ చేయకుండా ఆప్కాస్ పెట్టి అందులో మున్సిపల్ కార్మికులను చేర్చిందన్నారు. నేడు టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దుచేసి కాంట్రాక్టర్ల వ్యవస్థను తెస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. అంటే కార్మికులను పర్మినెంట్ చేయం, మరింత ఆర్ధిక దోపిడీకి గరయ్యే పనిచేపడతామంటున్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు.
జోన్ త్రీ కమిటీ కార్యదర్శి జె.ఆర్.నాయుడు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం జీవో ఆర్‌టి నెంబర్ 96 ప్రకారం మినిమం టైమ్ స్కేలు అమలు చేయాలని, హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుధ్యం, మలేరియా, చెత్త తరలించే ఎంఎస్‌ఎఫ్ డ్రైవర్లు, నీటి సరఫరా, యుజిడి కార్మికులు, డేటాఎంట్రీ ఆపరేటర్లును, పార్కులు, ఆర్టికల్చర్ విభాగాల్లో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని, క్లాప్ డ్రైవర్లు, లోడర్లు, బదిలీ కార్మికులకు జీవో ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కె.కుమారి, పి.వెంకటరావు, ఆర్.శ్రీనివాస్, ఈ ఆదినారాయణ, కొండమ్మ, విజయ, రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
వి.కృష్ణారావు
ఆర్గనైజ్ సెక్రటరీ