*ప్రచురణార్ధం / ప్రసారార్ధం (జివిఎంసి)*
ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వండి*
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ డిమాండ్*
*వందలాది మందితో ఛలో జివిఎంసి కార్యక్రమం*
విశాఖపట్నంలో దశాబ్ధాల తరబడి సొంతిల్లు లేని పేదలకు ఇల్లు లేదా రెండు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం వందలాదిమందితో ఆర్టీసి కాంప్లెక్స్ గురజాడ జంక్షన్ నుండి ఆశీలమెట్ట మీదుగా జివిఎంసి ప్రధాన కార్యాలయంకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ 78వవార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు అధ్యక్షతన జరిగిన సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ళ స్థలం లేక అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. గత 15ఏళ్ళు ఇళ్లులేని లబ్ధిదారులను గుర్తించినప్పటికీ నేటికీ సొంతింటికి నోచుకోలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ళు, గత ప్రభుత్వం వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల పేరుతో ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయి. కొంతమంది లబ్ధిదారులకు దృవీకరణ పత్రాలు అందజేసారు. ఇందలో అనేకమంది అప్పులుజేసి డిడిలు కట్టించారు. కానీ ఇవ్వమాత్రం అందజేయలేదని మండిపడ్డారు. నేడు మున్సిపల్ ఆఫీస్ వద్దకు దరఖాస్తు ఇవ్వడానికి ప్రజానీకం వచ్చినా ఆఫీస్‌లో కమీషనర్‌గాని, మేయర్ గాని లేకపోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రానికి అతి పెద్ద కార్పొరేషన్‌లో కమీషనర్‌ను గత నాలుగునెలలుగా నియమించకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మేయర్ పదవి కాపాడుకోవడం కోసం టిడిపి కూటమి కార్పొరేటర్లు, వైసిపి కార్పొరేటర్లంతా విదేశీ యాత్రలు పోయి ప్రజా సమస్యలను గాలికొదేలియడాన్ని తీవ్రంగా ఖండిరచారు. నేడు విశాఖలో ప్రజలకు అందుబాటులో ఉండే కార్పొరేటర్లు ఇద్దరే కనపడుతున్నారని అది సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లని గుర్తుచేసారు. తక్షణమే పేదల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధం, జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడులు మాట్లాడుతూ విశాఖనగరానికి ఉపాధి కోసం ఇతర జిల్లాలు, విశాఖ గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చి దశాబ్ధాలుగా విశాఖలో కుటుంబాలతో నివశిస్తూ సొంతింటికోసం పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. టిడ్కో, జగనన్న కాలనీల ఇళ్ళ నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని, నిర్మాణం పూర్తయినవి లబ్ధిదారులకు వెంటనే అందజేయాలన్నారు. పేదల ఉపాధికి అందుబాటులో స్థానికంగానే ఇల్లు, స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేసారు. అర్హులైన పేదలందర్నీ లబ్ధిదారుల జాబితాలో చేర్చి 2సెంట్లు స్థలం కేటాయించాలన్నారు. ప్రభుత్వం నిర్మించిన గృహ సముదాయాలు, కొండవాలు ప్రాంతాలు, మురికివాడల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వాంబే, జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం., ఇందిరమ్మ ఇళ్ళ రిపేర్లుకు పూనుకోవాలన్నారు. ఇంటి స్థలం ఉండి నిర్మాణానికి 5లక్షలు గ్రాంటుగా సహయం అందించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, పి.మణి, జోన్ కార్యదర్శులు ఆర్.ఎస్.ఎన్.మూర్తి, వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, బొట్టా ఈశ్వరమ్మ, పి.పైడిరాజు, ఎం.రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు డి.అప్పలరాజు, వి.నరేంద్రకుమార్, బి.రమణి, బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎం.జగ్గునాయుడు
కార్యదర్శి
ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ డిమాండ్ వందలాది మందితో ఛలో GVMC
33