పత్రికా ప్రకటన
*ఓట్ల లెక్కింపునకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి*
*8.00 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రారంభం
*ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏడు కౌంటింగ్ కేంద్రాలు
*సీపీతో కలిసి వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున
*ఏజెంట్లకు ఆల్కహాల్ పరీక్ష నిర్వహిస్తాం ః పోలీస్ కమిషనర్
విశాఖపట్టణం, జూన్ 01 ః ఓట్ల లెక్కింపునకు జిల్లాలో దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో జూన్ 04వ తేదీ ఉదయం 8.00 గంటలకే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది 6.00 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, విధుల్లో భాగస్వామ్యమయ్యే వారికి తొలి విడత శిక్షణ కూడా పూర్తి చేశామని, 3వ తేదీన ప్రత్యక్ష రూపంలో మలివిడత శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ నెల 03 నుంచి 06వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అందరూ శాంతియుతంగా ఉండి కౌంటింగ్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటివరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేదంటే ఆర్ఓల ద్వారా వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా, శాంతియుతంగా పూర్తి చేసేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోలీస్ కమిషనర్ డా. ఎ. రవిశంకర్ తో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 144 సెక్షన్, ఇతర విధివిధానాలను వివరించారు.
*ఏయూ పరిధిలోనే అన్ని లెక్కింపు కేంద్రాలు*
@ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని ఈ.ఈ.ఈ. బ్లాక్ సెమినార్ హాలులో, తొలి అంతస్తు రూమ్ నెం.4లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.
@భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్సులో గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.5లో, అక్కడ పోలైన పార్లమెంటు ఓట్ల లెక్కింపు అదే బిల్డింగ్ రూమ్ నెం.7లో జరుగుతుందన్నారు.
@తూర్పు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్సులోని మొదటి అంతస్తు రూమ్ నెం.9లో, పార్లమెంటు ఓట్ల లెక్కింపు రూమ్ నెం.10లో జరుగుతుందని పేర్కొన్నారు.
@దక్షిణ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంప్యూటర్ సైన్స్ బ్లాక్ లోని ఈ-క్లాస్ రూమ్‌లో, పార్లమెంటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అదే బ్లాక్ లోని కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎంబైడెడ్ సిస్టం ఐ.ఓ.టి. ల్యాబ్‌లోని మొదటి అంతస్తు రూమ్ నెం.ఎఫ్.ఎఫ్.-2లో జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
@ఉత్తర నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్సులోని మొదటి అంతస్తు రూమ్ నెం.1లో, పార్లమెంటు ఓట్ల లెక్కింపు అదే బిల్డింగ్ లోని మొదటి అంతస్తు రూమ్ నెం.5లో నిర్వహిస్తామని వెల్లడి
జూన్ 4 వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఆ రోజు కౌంటింగ్ సిబ్బంది అంతా ఉదయం 6 గంటలకు, ఏజెంట్లు ఉదయం 7 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని, అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. అన్నిచోట్లా అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ కు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
*రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు*
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏయూ పరిధిలో ఏడు హాళ్లు గుర్తించామని, నియోజకవర్గానికి రెండేసి చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 140 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఒక్కో టేబుల్ కు గాను ఒక్కో కౌంటింగ్ సూపర్ వైజర్, ఒక్కో కౌంటింగ్ అసిస్టెంటు, ఒక్కో మైక్రో అబ్జర్వర్‌ను నియమించామని చెప్పారు. పార్లమెంటు పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియను మూడు రౌండ్లలో నిర్వహించనున్నామని, దానికి గాను రెండు హాళ్లను గుర్తించామని, 18 టేబుళ్లను కేటాయించామని వివరించారు. 18 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను, 36 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను, మరొక 18 మంది నియమించామని పేర్కొన్నారు. ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాక కూడా ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసి వేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి ఆల్కహాల్ పరీక్ష నిర్వహిస్తామని, బ్రీత్ ఎన్లైజర్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం లెక్కింపు కేంద్రాలవద్ద కౌంటింగ్ అధికారులకు, ఏజెంట్లకు వేర్వేరుగా పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఇతరులను కించపరిచేలా గానీ, రెచ్చగొట్టే విధంగా గానీ ఎలాంటి పోస్టుల చేయరాదని హెచ్చరించారు. కేంద్రాల పరిధిలోకి వచ్చే వారు విధుల నిర్వహణ నిమిత్తం వచ్చే వారు తప్పకుండా ఐడీ కార్డులు ధరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పాల్గొన్నారు.
……………………………………………
జారీ, సార్వత్రిక ఎన్నికల మీడియా కేంద్రం, విశాఖపట్టణం.