గ్రామ తరంగ్, బాట్ క్లబ్ తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం
-దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో నాణ్యమైన సైన్స్ విద్య బోధన సులభతరం
-సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డి.ఎన్.రావు, ఛాన్సలర్ ఆచార్య జి ఎస్ ఎన్ రాజు
విశాఖపట్నం: దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో నాణ్యమైన సైన్స్ విద్యను అందించేందుకు గ్రామ తరంగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (జిటి టెక్) సంస్థ రాష్ట్రంలోని బాట్క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ (బాట్ క్లబ్) అనే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుందని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, గ్రామ్ తరంగ్ టెక్ ప్రమోటర్ ప్రొఫెసర్ డి.ఎన్.రావు వివరించారు. ఆదివారం పట్టణంలోని వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సులభంగా సైన్స్ ను బోధన చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. బాట్క్లబ్ అభివృద్ధి చేసిన `ఎ`వన్ ఆధారిత క్లాస్రూమ్, డిజిటల్ విజువలైజేషన్లతోపాటు పాఠశాలల అభ్యాస ఫలితాలపై కూడా విశ్లేషణలను అందిస్తుందన్నారు. తొలి దశ కింద మూడు నెలల్లో 45 పాఠశాలలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాగా, దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతో గ్రామ్ తరంగ్ టెక్నాలజీస్ స్థాపించామన్నారు. ఇందుకు సెంచూరియన్ విశ్వవిద్యాలయం నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనున్నట్టు తెలిపారు.
సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో విద్య కేవలం బట్టీపట్టే పద్ధతికి అతీతంగా ఉండాలని, యువతలో పరిశోధనా స్ఫూర్తిని నిజంగా రగిలించాలని మేము కృషి చేస్తొన్నామని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. సాంకేతికత, బోధనా పద్ధతి ఒక లక్ష్యంతో కలిసినప్పుడు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. బాట్క్లబ్ తో ఒప్పందం ఇందుకు దోహదపడుతుందన్నారు.
జిటి టెక్ అనేది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదని, తాము మానవ సామర్థ్యాన్ని పెంపొందించే ఒక సాధనంగా తీర్చిదిద్దామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాబు శంకర్ పేర్కొన్నారు. బాట్క్లబ్తో భాగస్వామ్యం అనేది వ్యూహాత్మక ఒప్పందమన్నారు. ఇది ఫిన్‌టెక్ నైపుణ్యం, ఇండస్ట్రీ 4.0 సామర్థ్యాలు మరియు విద్య పట్ల ఉన్న అభిరుచిని ఒక శక్తివంతమైన ప్రతిపాదనగా ఏకం చేస్తుందన్నారు.
ప్రతి విద్యార్థికి సైన్స్‌ను అర్థవంతంగా అర్థమయ్యేలా అందించడమే బాట్క్లబ్ యొక్క లక్ష్యమని బాట్ క్లబ్ కో-ప్రమోటర్ కె.హర్షవర్థన్ అన్నారు. మా వృద్ధిని వేగవంతం చేయడానికి సెంచూరియన్ విశ్వవిద్యాలయం దోహదపడుతుందన్నారు.