గర్భాశయ క్యాన్సర్ పైన అవగాహన సదస్సు #vvwnews

by vvwnews.com

గర్భాశయ క్యాన్సర్ పైన అవగాహన సదస్సు
విశాఖపట్నం 31 జనవరి 2026 : స్థానిక బీచ్ రోడ్డులోని ది పార్క్‌ హోటల్ నందు రోహిత్ మెమోరియల్ ట్రస్టు వారి సారధ్యంలో గర్భాశయ క్యాన్సర్ పై రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు నకు డాక్టర్ శంఖబ్రత బాగ్చి IPS విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ సుమన్ దాస్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గర్భాశయ క్యాన్సర్ పైన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాన్సర్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు డాక్టర్ కె. శిల్ప క్యాన్సర్ కు సంబంధించిన HPV టీకా పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వివరించారు. డాక్టర్ వి. మురళీకృష్ణ, సర్జికల్ ఆంకాలజిస్ట్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌, డాక్టర్ సీతా కళ్యాణి, సీనియర్ గైనకాలజిస్ట్, డాక్టర్ ఆదిత్య, CEO, HCG మరియు పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను ఈ సదస్సులో వెల్లడించారు. ఈ సద్స్సునకు వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక మీడియా ప్రతినిధులు , NGOలు, స్థానిక పాఠశాలలు మరియు పరిశ్రమల నుండి పలువురు ప్రతినిధులు హాజరై ఈ క్యాన్సర్ పట్ల తమ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
నేడు ప్రపంచంలో గర్భాశయ క్యాన్సర్ రెండవ అత్యంత ప్రభావవంతమైన కాన్సర్, దీని సకాలంలో గుర్తిస్తే నివారించగల కాన్సర్ లలో ఒకటి అయినప్పటికీ సరియైన అవగాహన లేకపోవటం వలన ఇది అనేక మంది మహిళల పైన ప్రభావం చూపిస్తున్నది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఇది అతి ప్రమాదకరమైన వైరస్. ఇది దీర్ఘకాలం కొనసాగి నపుడు కాన్సర్ గా మారేందుకు కారణం అవుతుంది. యోని నుండి అసాధరనంగా రక్త స్రావం మరియు అధిక దుర్వాసన రావటం ఈ వ్యాధి ప్రాధమిక లక్షణాలు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చును. HPV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ యొక్క అధిక-ప్రమాదకర HPV వైరస్ నుంచి రక్షించి, 90% గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది. మహిళల ఆరోగ్యానికి భంగం కలిగించే గర్భాశయ క్యాన్సర్‌ నిర్మూలనకు HPV టీకాలు వేయడం ఒక సమర్థనీయమైన ముందడుగని సదస్సుకు హాజరైన పలువురు వ్యక్తపరిచారు. 9-14 వయస్కులు 2 డోసులు, 15-26 వయస్కులు 3 డోసులు చొప్పున ఈ టీకా తీసుకోవాలి. 26 సవత్సరాలు పైబడిన వారు వైద్యుల సలపైన దీనిని పొందవచ్చును.
ఈ టీకా వివాహానికి ముందు సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇది సంతానోత్పత్తికి ఎలాటి ఆటంకం కాదు. ఈ గర్భాశయ కాన్సర్ ముందస్తుగా గుర్తిస్తే చికిత్స అందించ వచ్చును మరియు నివారించ వచ్చును. ఈ వ్యాధి పట్ల అవగాహన, స్క్రీనింగ్ మరియు టీకా ఈ మూడు మహిళలను ఈ వ్యాధి నుండి కాపాడగలవు. ఈనాటి నివారణ రేపటి రక్షణకు మార్గం. ఈ సందేశాన్ని వెంటనే వ్యాప్తి చేయాలని, HPV టీకా కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా మాట్లాడిన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ (RMT) వారు తమ జ్ఞానలక్ష్మి కార్యక్రమంలో భాగంగా మహిళల క్యాన్సర్లపై అవగాహన కల్పించడానికి ఈ సదస్సు నిర్వహించినది. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ (RMT) 17సంవత్సరాల క్రితం స్థాపించారు. క్యాన్సర్ అవగాహన, కౌన్సెలింగ్, పాలియేటివ్ మెడికల్ క్లౌనింగ్ మరియు మహిళా సాధికారత వంటి రంగాలలో సామాజిక ఉన్నతి కోసం వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మా ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు మద్దతు అందించుటకు పలువురు ముందుకు రావాలని ట్రస్టు కోరుతున్నాది.

Use Social Media to Spread the Word about Our News

related articles