GMRV Glaucoma Walk_Telugu.docx
1 / 2
పత్రికా ప్రకటన
గ్లకోమా అవగాహనా నడక – మార్చ్ 16, 2025
విశాఖపట్నం మార్చ్ 16, 2025:
ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా ఉన్నవారి సంఖ్య దాదాపు 80 మిలియన్లు ఉన్నదని అంచనా. అందులో దాదాపు 50% మందికి అది ఉన్నదనే అవగాహన లేదు. ఈ సంఖ్య అభివృద్ధి చెందని దేశాలలో మరింత ఎక్కువగా ఉండవచ్చు. దీనికి కారణం గ్లకోమా తీవ్రదశకు వచ్చేవరకూ లక్షణాలు కనబడకపోవడం. చికిత్స చేయకపోతే, గ్లకోమా అంధత్వానికి దారితీయవచ్చు. పెరిగిన కంటి ఒత్తిడికి సంబంధించిన కంటి సమస్య గ్లకోమాను ‘నిశ్శబ్ద చూపు దొంగ’ అంటారు. ఎందుకంటే, ఒకసారి చూపు పోతే, దానిని పునరుద్ధరించలేము.
పునరుద్ధరించలేని అంధత్వానికి అత్యంత సాధారణ కారణం గ్లకోమా. 40 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 200 మందిలో ఒకరికి, 80 ఏళ్లు పైబడిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి గ్లకోమా ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాలు 1.2 కోట్ల భారతీయులు (భారత జనాభాలో 4.5%) గ్లకోమా బారిన పడుతున్నారని సూచిస్తున్నాయి. అందులో 11 లక్షలమంది గ్లకోమా కారణంగా అంధులయ్యారు. గ్లకోమా అంధత్వం కలిగించే వ్యాధి అయినప్పటికీ, గ్లకోమా ఉన్న చాలామంది రోగులు అంధులు కారు అని మనం గుర్తుంచుకోవాలి. వారికి గ్లకోమా సంరక్షణనందిస్తున్నవారి సూచనలను వారు పాటిస్తే, వారు ఒక ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలుగుతారు.
గ్లకోమాను అదుపులో ఉంచడానికి అవసరమైనది ఏమిటి? గ్లకోమాను త్వరగా గుర్తించండి
క్రమబద్ధమైన పరీక్ష ఒక్కటే త్వరిత నిర్ధారణ చేయగలుగుతుంది, దృష్టి వైకల్యాన్ని నివారిస్తుంది. అధిక మయోపియా (దూరం చూడటానికి మందంగా ఉన్న కళ్ళద్దాలు) ఉన్నవారికి, మధుమేహం ఉన్నవారికి, 4-6 వారాలకన్నా ఎక్కువ కాలం స్టెరాయిడ్లు ఉపయోగించినవారికి మరియు గ్లకోమా కుటుంబ చరిత్ర ఉన్నవారికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఉన్నది.
ప్రపంచ గ్లకోమా సంస్థ ప్రకారం, ఈ క్రింది పరీక్ష చేయించుకోవడం మంచిది:
· మీరు 40 ఏళ్ల వయసుకంటే తక్కువ వయసువారయితే ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి
· 40-60 ఏళ్ల వయసు మధ్యవారయితే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి
· 60 ఏళ్ల వయసు పైబడినవారయితే ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి
త్వరిత గుర్తింపు రాబోయే సంవత్సరాలలో చూపును కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటాన్ని సాధ్యం చేస్తుంది. త్వరగా గుర్తించి, చికిత్స చేస్తే 80% గ్లకోమా సంబంధిత అంధత్వాన్ని నివారించవచ్చు. అయినప్పటికీ, ప్రపంచ గ్లకోమా సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 మిలియన్ల ప్రజలు గ్లకోమా కారణంగా అంధులు అవుతున్నారు. అందులో 66% మహిళలు. అవగాహనా లేమి వలన 90% గ్లకోమా కేసులు గుర్తించబడకపోవడం దీనికి కారణం.
క్రమబద్ధంగా మందుల వాడకం మరియు పరీక్షలు
2 / 2
గ్లకోమా రోగులు సాధారణంగా కంటి మందుచుక్కలను వాడవలసి ఉంటుంది. చూపును కాపాడుకోవడంలో కంటి మందుచుక్కలను క్రమబద్ధంగా వాడటం అత్యంత ముఖ్య కారకం. చూపు పోవడంలో సూచించిన మందు వాడకపోవడం అత్యంత సాధారణ కారకమని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా, ఆఫ్థల్మాలాజిస్టుచేత క్రమబద్ధమైన పరీక్షలు చేయించుకోవడం సముచితం. ఇంటివద్ద సరైన పరీక్షలు లేనప్పుడు, దృష్టి స్థితి మరియు చికిత్స సామర్ధ్యం తెలుసుకోవడానికి ఆసుపత్రి ఆధారిత పరీక్ష ఒక్కటే మార్గం.
పెద్దలు మరియు పిల్లలు ఇద్దరినీ ప్రభావితం చేసే గ్లకోమా వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ఎల్విపిఇఐ నేత్ర సంరక్షణా వ్యవస్థ మార్చి 8-16 తేదీలలో గ్లకోమా అవగాహన వారోత్సవాన్ని నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక మాధ్యమంలో ప్రచారాలు, ప్రాక్టీసు చేస్తున్నవారికోసం వర్క్‌షాప్‌లు మరియు నిరంతర వైద్య విద్య (సిఎంఈ) సెషన్‌లు ఉన్నాయి. 2025 మార్చి 16 వ తేదీన దాదాపు 200 మంది పాల్గొన్న నడక బీచ్ రోడ్డులోని కాళీ మందిరం దగ్గర ప్రారంభమయి విశాఖపట్నం వైవీఎంసి వద్ద ముగిసింది.
ఎల్విపిఇఐ జిఎంఆర్ వరలక్ష్మి ప్రాంగణంలో గ్లకోమా కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ డా సాయి యశ్వంత్ టి మాట్లాడుతూ, “గ్లకోమాను తొలిదశలో గుర్తించడానికి, దానిని మెరుగుగా నిర్వహించడానికి మరియు అంధత్వాన్ని నివారించడానికి దయచేసి క్రమం తప్పకుండా సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోండి. ముఖ్యంగా మీకు గ్లకోమా కుటుంబ చరిత్ర ఉన్నట్లయితే, పరీక్షలను తప్పించుకోకండి,” అని అక్కడున్న అందరినీ కోరారు.
ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ: “అవసరంలో ఉన్నవారందరికీ అందుబాటులో ఉండగల అత్యుత్తమ మరియు న్యాయబద్ధ నేత్ర సంరక్షణా వ్యవస్థలను రూపొందించడం” అనే లక్ష్యంతో 1987 సంవత్సరంలో స్థాపించబడిన ఒక సమగ్ర నేత్ర ఆరోగ్య సౌకర్యం, ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ), అంధత్వ నివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం.
ఈ లక్ష్య సాధనలో, ఎల్విపిఇఐ వైద్యులు మరియు శాస్త్రవేత్తలు అత్యాధునిక కంటి పరిశోధన దిశలో పని చేస్తున్నారు. ఐదు శ్రేణుల “ఐ హెల్త్ పిరమిడ్” నమూనా ద్వారా సంస్థ ఇప్పటివరకూ 3 కోట్ల 68 లక్షల సేవలను అందించింది. అందులో సంరక్షణ సంక్లిష్టతతో సంబంధం లేకుండా, 50% కంటే ఎక్కువ ఉచితం. మరింత సమాచారానికి సంస్థ వెబ్ సైట్ www.lvpei.org సందర్శించండి.