ప్రచురణార్థం
తేదీ: 29-9-24
ఉపాధి జోలికొస్తే ఖబర్దార్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ ఉపాధి జోలికి వస్తే ఖబడ్దార్ అని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ప్రభుత్వ యాజమాన్యాలను హెచ్చరించారు. నేడు స్టీల్ సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మహా పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి వడ్లపూడి, పాత గాజువాక, పెదగంట్యాడ నెల్లిముక్కు స్టేజి వరకు నిర్వహించారు. దీనిని జిల్లా సిఐటియు నాయకులు ఎం జగ్గు నాయుడు, ఆర్ ఎస్ వి కుమార్ ప్రారంభించారు. పాదయాత్ర అనంతరం నెల్లిముక్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య వక్తగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ, యాజమాన్యాల వైఫల్యాలను కప్పిబుచ్చుకోవడం కోసం ఆ నేరాన్ని కార్మికులపై నెట్టడం కోసం కాంట్రాక్ట్ కార్మికులను బలి చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులను ఉపాధికి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. వీరిలో తమ విలువైన భూములను ఈ ప్లాంట్ కోసం ఇచ్చిన నిర్వాసితులు ఉన్నారన్న సోయ లేకుండా ప్రభుత్వ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆయన వివరించారు. ఆనాటి పాలకులు ఇచ్చిన హామీని గాని, నేటి పాలకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాని మరచి నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వంత పాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా సిఐటియు అధ్యక్షులు కె ఎం శ్రీనివాస్, జిల్లా నాయకులు బి జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణలో అలసత్వాన్ని ప్రదర్శించడం తోనే నేడు ఈ గతి పట్టిందని వారు అన్నారు. స్థానిక పార్లమెంటు, శాసనసభ్యులు ఎన్నికల ముందు చేసిన పోరాటాలను నమ్మి ఇక్కడ ప్రజానీకం వారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీని ఇచ్చారని వారు వివరించారు. కనుక ఈ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా నేడు ప్లాంట్ లో జరుగుతున్న పరిణామాలు ఉన్నాయని వారు అన్నారు. కనుక స్థానిక పార్లమెంట్, శాసన సభ్యులు తమ గళాన్ని విప్పి కేంద్ర ప్రభుత్వ యాజమాన్యాల వైఖరిని ప్రశ్నించాలని వారు డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్, ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించడం చేతకాని యాజమాన్యం కార్మికుల సంఖ్య పైన, వారి హక్కుల పైన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వారు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యాజమాన్యాలు తమ వైఖరిని మార్చుకొని దీనిని పూర్తిస్థాయి ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, గౌరవాధ్యక్షులు ఓ వి రావు మాట్లాడుతూ స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులకు పోరాటాలు కొత్త కాదని పోరాటాలతో సాధించుకున్న హక్కులపై ప్రభుత్వ యాజమాన్యాలు దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పదని వారు హెచ్చరించారు. ప్రభుత్వ యాజమాన్యాల అణిచివేతకు నిరసనగా ఐక్య ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు సత్యవతి, వివి రమణ, పి నారాయణ రావు, ఆదిరెడ్డి శ్రీను, మసేన్, సోమేశ్, కెపి సుబ్రహ్మణ్యం, శశిభూషణ్, బొట్టు నరసింహారావు, సూర్య కుమార్, కృష్ణ, వరహాలు తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.
జి శ్రీనివాస్
అధ్యక్షులు
స్టీల్ సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్