పత్రికా ప్రకటన
*దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవిరళ కృషి*
*కేంద్ర మత్స్య, పశుసంవర్దక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల
*డీఎల్బీ గ్రౌండ్లో రూ.2.25 కోట్లతో 1589 మంది దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
*భాగస్వామ్యమైన ఎంపీ జీవీఎల్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎండీ, జాయింట్ కలెక్టర్
విశాఖపట్టణం, ఫిబ్రవరి 15 ః దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయని కేంద్ర మత్స్య, పశుసంవర్దక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల పేర్కొన్నారు. ఎ.డి.ఐ.పి. (అసిస్టెన్స్ టు డిజెబుల్డు పర్శన్స్ ఫర్ పర్చేజ్ /ఫిట్టింగ్ ఆఫ్ ఎయిడ్స్/ అప్లియెన్స్) పథకం కింద గురువారం విశాఖపట్టణంలోని కైలాసపురం డీఎల్బీ గ్రౌండ్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శిబిర్ పేరుతో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్శింహారావు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఎండీ కుమార్ రాజా, జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లాలోని దివ్యాంగులకు అందజేశారు. రూ.2.25 కోట్లతో 2,925 పరికరాలను అలింకో సంస్థ ఆధ్వర్యంలో తయారు చేయగా 1,589
1,589 దివ్యాంగులకు ఒకే చోట ఇంత మొత్తంలో ఉపకరణాలు పంపిణీ చేయటం ఒక శుభపరిణామమని, దీనికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.. అని కేంద్ర మంత్రి పుర్షోత్తం రూపాల పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విజన్, సున్నిత మనస్తత్వం కారణంగానే దివ్యాంగులకు ఇంత స్థాయిలో మంచి జరుగుతుందని అన్నారు. అడిగితేనే గానీ కొంతమంది నేతలు స్పందించరు.. కానీ నరేంద్ర మోదీ అడగకుండానే పేదలకు అన్నీ ఇస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారు. ప్రజల సుఖాలు, దుఖాల గురించి బాగా తెలిసిన వ్యక్తి రాజుగా (దేశ ప్రధానిగా) ఉండటం మనందరి అదృష్టం అని పేర్కొన్నారు. పేదల కోసం చేసే మంచి పని ఏదైనా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రసార మాధ్యమాలనుద్దేశించి అన్నారు.
*దివ్యాంగుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలి ః జీవీఎల్*
అంగవైకల్యం అనేది కోరుకుంటే వచ్చింది కాదని.. దురదృష్టం వల్ల వచ్చిందని.. దివ్యాంగుల పట్ల మనమంతా గౌరవ మర్యాదలతో నడుచుకోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్శింహారావు సూచించారు. దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమం విశాఖలో నిర్వహిస్తున్నామని చెప్పగానే కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని, సహకారం అందించారని గుర్తు చేశారు. వారి ఆమోదంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వికలాంగులు అనే పదం పూర్తిగా తొలగిపోయిందని, దాని స్థానంలో దివ్యాంగులు అనే పదం వచ్చిందని పేర్కొన్నారు. రెండు దఫాల భాజపా పాలనలో సుమారు 45 లక్షల మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించామని, వచ్చే ఐదేళ్లలో మరొక 50 లక్షల మందికి పరికరాలు అందజేస్తామని జీవీఎల్ నర్శింహారావు చెప్పారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టలలో చేపట్టే ప్రతి పనినీ దివ్యాంగులను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నామన్నారు. ఉపకరణాల తయారీలో అలింకో (ఆర్టిఫిసియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
*రాష్ట్రంలో రూ.25 కోట్లతో 4వేల మందికి చేయూత ః ఎండీ కుమార్ రాజా*
దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి నిర్ణయాలు తీసుకుందని దానిలో భాగంగానే రూ.25 కోట్లతో నాలుగు వేల మందికి వివిధ ఉపకరణాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఎండీ కుమార్ రాజా వెల్లడించారు. దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్లు, మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,750 మంది దివ్యాంగ విద్యార్థులకు త్రిచక్ర వాహనాలు అందించామని గుర్తు చేశారు. గుంటూరులో ఉన్న బ్రెయిలీ ప్రింటింగ్ కేంద్రం సాయంతో అంధ విద్యార్థుల సహాయార్థం బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తూ దివ్యాంగులకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు.
*రూ.2.25 కోట్లతో 2,925 పరికరాలు ః జేసీ*
జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన 2,925 పరికరాలను రూ.2.25 కోట్లు వెచ్చించి అలింకో (ఆర్టిఫిసియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ సహకారంతో తయారు చేయించామని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఈ సంస్థ సహకారంతో ఇప్పటికే విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో 13 చోట్ల ప్రత్యేక శిబిరాలు నిర్వహించామని, వారి అవసరాలను గుర్తించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ వేదిక ద్వారా 1,589 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందజేస్తున్నామని జేసీ తెలిపారు. 2,925 పరికరాల్లో 282 మోటరైజ్డ్ సైకిళ్లు, 173 ట్రైసైకిళ్లు, 219 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రచ్చెస్ 657, వినికిడి పరికరాలు 868, వాకింగ్ స్టిక్స్ 146, బ్రెయిలీ కిట్స్ 45, స్మార్ట్ ఫోన్లు 15, సాధారణ సెల్ఫోన్లు 10, సీపీ ఛైర్స్ 40, లింబ్స్ ఇతర పరికరాలు 470 వరకు ఉన్నాయని వివరించారు.
కార్యక్రమంలో అలింకో సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింఘ్, విభిన్న ప్రతిభావంతుల శాఖ విశాఖపట్టణం జిల్లా ఏడీ మాధవి, విజయనగరం జిల్లా ఏడీ జగదీష్, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.
…………………………………..
జారీ, ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్టణం.