సంపద సృష్టి అంటే ఇదేనా! చంద్రబాబు
* ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విశాఖ బీచ్ లో బీర్లు అమ్ముతారా?
* ఖబడ్దార్! అధికారంలోకి వచ్చిన వెంటనే బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తాం!
* ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో వెనక్కి తీసుకోండి!
* వినూత్న నిరసన చేపట్టిన
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
ఆహ్లాదం.. ఆనందం.. ప్రశాంతత అందించే ఆధ్యాత్మిక విశాఖపట్నం బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు ప్రాంతంగా మార్చుతారా? ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీచ్ షాక్స్ పేరుతో విశాఖ బీచ్ లో మద్యం షాపులు ఏర్పాటు కి వ్యతిరేకంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా బీచ్ లో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. డ్రామా కోణంలో పసుపు చొక్కాలు వేసుకుని టిడిపి శ్రేణులతో బీచ్ రోడ్ లో బీర్లు, వైన్లు, చీకుళ్ళు దుకాణాలు పెట్టి అమ్ముతున్న వైనాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ వైసీపీ శ్రేణులతో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టి చేతకాని దద్దమ్మలంటూ ధ్వజమెత్తారు. ఇక్కడి ప్రాంతంలో ఈస్ట్రన్ నావెల్ కమాండర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలతో పాటు విఘ్నేశ్వరుడి నిమజ్జనాలు, పౌర్ణమి పుణ్య స్నానాలు, శివరాత్రికి కోటి శివలింగాలతో పూజలు అందుకున్న మహా పవిత్ర పుణ్యస్థలం విశాఖ బీచ్ లో బీర్లు వైన్ ను దుకాణాలు పెట్టి యువతను మత్తులో ముంచుతారా? అంటూ చంద్రబాబు, లోకేష్, విశాఖ ఎంపీ భరత్ పై వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, పాఠశాలలు దగ్గరే నిబంధనలు పాటించకుండా మద్యం దుకాణాలు ఎక్కడపడితే అక్కడ రాష్ట్రంలో ఏరులై పారిస్తున్న అది సరిపోవటం లేదా? మా మత్స్యకారులు నివసించే ప్రాంతమే కావాలా ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరారు. బీచ్ లో మద్యం సేవించి సముద్రంలో ఈతకు వెళ్లి చనిపోతే ఎవరు బాధ్యులంటూ ప్రశ్నించారు. మద్యం సీసాలను సముద్రంలో పారివేస్తే చెప్పులు లేని మా మత్స్యకారులకు గాయాలు పాలవుతారని వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోను, ఈ దుకాణాలను బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తామని హెచ్చరించారు. పర్యాటకం రంగంగా అభివృద్ధి చేయాలంటే ఇదో ఒక్కటే మార్గమా? అంటూ ధ్వజమెత్తారు. మాట్లాడితే గోవా మాదిరిగా.. బికినీలు, థాయిలాండ్ లా మార్చేస్తాననీ విశాఖ సంస్కృతిని చెడగొడుతూ 2014లో కూడా చంద్రబాబు చిందులు వేస్తే ఇక్కడి స్థానిక మహిళలు ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమంటూ ఆలయాల మెట్లు శుభ్రం చేసి చేతులు దులుపుకున్నాడని దుయ్యబడ్డారు. ఇప్పుడు విశాఖలో ఇంత పవిత్ర స్థలంలో ప్రశాంత బీచ్ వాతావరణాన్ని పాడు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, భరత్ తో కలిసి పవన్ కళ్యాణ్ సముద్రంలో మూడుసార్లు మునిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, దక్షిణ కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, బిపిన్ జైన్ వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వర రెడ్డి, పీతల వాసు, దస్మంతుల మాణిక్యాలరావు, దొడ్డి బాబు ఆనంద్, పిన్నింట్ల రాజారెడ్డి,ఆలూపున కనకరెడ్డి, మహమ్మద్ షకీల్, గురుజపు రవి ,ముజీబ్ ఖాన్, కోడిగుడ్ల శ్రీధర్, భీశెట్టి ప్రసాద్,స్టేట్,జిల్లా, సౌత్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకులు, మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.