సీతమ్మధారలోని ఎస్.ఎఫ్.ఎస్ ఉన్నత పాఠశాల విద్యా, విజ్ఞాన రంగాల అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తోందని ప్రోవిన్షియల్ మరియు ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్స్ జనరల్ మేనేజర్, రెవరెండ్ ఫాదర్ బి. సురేష్ బాబు పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం సీతమ్మధారలోని పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 1974లో సుమారు 245 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాల నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మేధావులను ప్రపంచానికి అందించిందన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్, రెవరెండ్ ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ, గొప్ప చరిత్ర కలిగిన ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ విద్యా రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకుందని తెలిపారు.
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శీనుబాబు మాట్లాడుతూ, మెరుగైన సౌకర్యాలు ఉన్న విద్యాసంస్థల్లోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను సెయింట్ అలోసియస్ ప్రెసిడెంట్ థామస్ పెరుమల్లి ప్రారంభించగా, మొదటి అంతస్తును రెవరెండ్ ఫాదర్ బి.సురేష్ బాబు, రెండవ అంతస్తును రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలకు లభించిన ఐఎస్ఓ సర్టిఫికేట్‌ను ఎస్.ఎఫ్.ఎస్ జనరల్ మేనేజర్ సురేష్ బాబు, ప్రిన్సిపాల్ మనోజ్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్ జోజి, సీబీఎస్సీ ప్రిన్సిపాల్ ఫాదర్ విజయ్, సంఘసేవకులు దామోదర్, విజయ్ శేఖర్, భాస్కర్ రెడ్డి, వర్గీస్, జిల్లా విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.