ఫోటో ఉంది
విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టాలి
— సి.ఆర్.సి.జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే
విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టాలని
కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పాఠశాల విద్యార్థుల పై పెరుగుతున్న విద్యా ఒత్తిడి పై ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా రంగంలో పెరుగుతున్న వ్యాపారీకరణ, చిన్నారులపై సమగ్ర కోచింగ్ విధానాల ద్వారా పెరుగుతున్న మానసిక ఒత్తిడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది పిల్లలలో జ్ఞానం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాల్సినదే కానీ, చిన్న వయసులోనే వారిని అనారోగ్యకరమైన పోటీ వ్యవస్థలోకి నెట్టకూడదని అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉందని పేర్కొంటూ, విద్యాసంస్థల్లో బాలల రక్షణ, విద్యా చట్టాల అమలును ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని కోరారు.
అలాగే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కోచింగ్, ఫలితాల ఆధారిత విద్య పేరిట తల్లిదండ్రులపై ఆర్థిక భారం, ఒత్తిడిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం, విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం 2020 ఆత్మను పునరుద్ధరించాలని విద్యాశాఖ అధికారులను కోరారు.
విద్యా వ్యవస్థలో చట్టబద్ధమైన సంస్కరణలు చేపట్టాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సంబంధిత విద్యా అధికారులకు సమగ్ర నివేదికను ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు.
6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఐఐటీ- జెఇఇ/నీట్ సమగ్ర కోచింగ్ నిషేధించాలని, ఆర్.టి.ఇ.చట్టం, బాలల రక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని,అధిక విద్యా భారం, కోచింగ్ ఒత్తిడిని నియంత్రించాలని,
బలవంతపు స్టడీ మెటీరియల్ కొనుగోలు, విద్యా వ్యాపారీకరణను నిషేధించాలని,
ఉల్లంఘనలపై కఠిన పర్యవేక్షణ, అమలు వ్యవస్థ ఏర్పాటు చేయాలని వికాస్ పాండే డిమాండ్ చేశారు.
సి.ఆర్.సి.జాతీయ ఉపాధ్యక్షులు పి.వి.జి.విశ్వనాధ్ మాట్లాడుతూ పిల్లలకు అనుకూలమైన, ఒత్తిడి లేని, చట్టబద్ధమైన విద్య అవసరమని, విద్య హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం 2020,సి.బి.ఎస్.ఇ నిబంధనలు,ఎన్. సి.పి.సి.ఆర్. మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు.
సి.ఆర్.సి. విశాఖ జిల్లా అధ్యక్షులు ఏ. శరత్ చంద్ర మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అమలు చేస్తున్న అధిక కోచింగ్ విధానాల వల్ల విద్యార్థులు తీవ్రమైన విద్యా, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. చిన్న వయసులోనే పోటీ పరీక్షల ఒత్తిడిని పిల్లలపై మోపకూడదని, విద్యార్థుల హక్కులు, మానసిక ఆరోగ్యం, గౌరవాన్ని పరిరక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ మీడియా సమావేశంలో
సి.ఆర్.సి.జాతీయ ప్రతినిధి
అవినాష్ బెంజిమెన్,
రాష్ట్ర కార్యదర్శి కె. సాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజు జోషువ
తదితరులు పాల్గొన్నారు.