శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.
సింహాచలం దేవస్థానం: చందనోత్సవం టిక్కెట్ల విక్రయం ఇప్పుడు సాఫీగా కొనసాగుతోంది – ఆలయ ఈఓ ప్రకటన
సింహాచలం, ఏప్రిల్ 15: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవానికి సంబంధించి టిక్కెట్ల విక్రయ ప్రక్రియ ఇప్పుడు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ (బ్యాంకులలో) వేదికల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
గత మూడు రోజులుగా సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్‌లో తలెత్తిన సమస్యలను ఐటీ నిపుణుల సహాయంతో పూర్తిగా పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. నేటి నుండి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
వెబ్‌సైట్ మరియు సర్వర్ సమస్యలను అధిగమించాం. భక్తులు ఆన్‌లైన్‌లో నిర్ణీత కోటా ప్రకారం టిక్కెట్లను సులభంగా పొందవచ్చు.
యూనియన్ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ శాఖల ద్వారా ఆఫ్‌లైన్ టిక్కెట్ల పంపిణీ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించాం. భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులకు సూచించడమైనది.
టిక్కెట్ల కేటాయింపులో పారదర్శకత పాటిస్తున్నామని, భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఈఓ కోరారు. చందనోత్సవ దర్శనాన్ని భక్తులు ప్రశాంతంగా చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.