*ప్రచురణార్థం / ప్రసారార్థం*
*పెదగంట్యాడలో అదాని సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి.
పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదాని సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేసారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.క్రిష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు యు.ఎస్.ఎన్ రాజు తో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ ,ప్రెస్‌మీట్ నిర్వహించారు* .
*
ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ అదాని అంబూజా సిమెంట్స్ కంపెనీ సాగరతీరం, జనవాసాలకు మధ్య ఏర్పాటు వలన గంగవరం,పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం, సింధియా మొదలు శ్రీహరి వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న సుమారు 10లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుంది. ఈ పరిశ్రమ వలన గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితమవుతాయి. శబ్ధ కాలుష్యం పెరుగుతుంది. భారీ వాహన రాకపోకలు పెరిగి ప్రమాదాలు పెరుగుతాయి. ప్రాణనష్టం అధికమవుతుంది. ఈప్రాంతం గుండా ప్రతిరోజు కొన్ని వేలమంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరికి రక్షణ వుండదు. ఈ పరిశ్రమకు కేటాయించదలచిన భూముల్లో వృక్షాలు, కొన్ని రకాల వణ్యప్రాణులు కనుమరుగ వుతాయి. పర్యావరణానికి హాని చేకూరుతుంది.అదానీ ప్రయోజనాల కోసం 10లక్షల మంది ప్రజలు, జీవరాసుల ప్రాణాలను ఫణంగా పెట్టడం అన్యాయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎంపీ భరత్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు,విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు వీరు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ కంపెనీ అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
అదానీ సిమెంటు పరిశ్రమ ఏర్పాటువలన అదనపు కాలుష్యం తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమి లేదు. కేవలం 60 పర్మినెంటు, 200మందికి కాంట్రాక్టు ఉపాధి మాత్రమే లభిస్తుంది.అది కూడా స్థానికులకు ఇస్తారన్న గ్యారంటీలేదు.
అదానీ గంగవరం పోర్టు కాలుష్యం వలన ఇప్పటికే గాజువాక, విశాఖ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతాల ప్రజలు తీవ్ర రోగాల బారినపడుతున్నారు. ఇళ్లలోపలకు రసాయనాలు, దుమ్ము, పౌడరు వచ్చి చేరుతున్నాయి. మహిళలకు గర్భస్రావాలవుతున్నాయి. వయస్సులతో నిమిత్తం లేకుండా అన్ని తరగతుల ప్రజలు రోగాల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనికి తోడు ఆదానీ సిమెంటు పరిశ్రమ వస్తే ఈప్రాంత ప్రజల జీవితాలు మరింత దుర్భరమవుతాయి. అదానీకి తమ లాభాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని ఆచరణలో తేలిపోయింది. గంగవరం పోర్టు కాలుష్యంతో అపార్ట్‌మెంట్లు, కాలనీల ప్రజలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు నరకం చూస్తున్నారు.
కనుక 10లక్షల మంది ప్రజలకు హానిచేసే పెదగంట్యాడ అదానీ సిమెంట్ కంపెనీకి ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని, ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని, అదాని గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు.
అదాని సిమెంట్ కంపెనీ వల్ల ప్రజానీకానికి, పర్యావరణానికి వచ్చే ప్రమాదాన్ని వివరించి, దీనిని నిలువరించేదానికి ప్రజలను సన్నధ్ధం చేసేందుకు సిపిఎం పార్టీ ఇప్పటికే లక్షల సంఖ్యలో కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తోంది. పాదయాత్రలు గ్రూప్ మీటింగులు నిర్వహిస్తోంది. పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది.
గంగవరం, పెదగంట్యాడ మొదలు గాజువాక నియోజకవర్గం, సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం మొదలు విశాఖ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రముఖులు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు, అపార్ట్మెంట్ ,నివాస ప్రాంతాల అసోసియేషన్లు, గ్రామ సంఘాలు అదాని సిమెంట్ కంపెనీని పబ్లిక్ హియరింగును రద్దు చేసేందుకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేసారు.
ఇట్లు
ఎం.జగ్గునాయుడు
సిపిఎం జిల్లా కార్యదర్శి