రుషికొండ భవనాలపై దుష్ప్రచారం వద్దు
— రాష్ట్రపతి, గవర్నర్ల విడిదికోసం నిర్మించిన భవనాలవి
— జగన్మోహన్ రెడ్డి సొంతానికి వాటిని నిర్మించలేదు
— ఇవి ప్రభుత్వ భవనాలు.. సద్వినియోగం చేసుకోండి
— ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోండి
— ప్రభుత్వానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచన
విశాఖపట్నం, జూన్ 17: రుషికొండపై నిర్మించిన భవనాల విషయంలో ప్రభుత్వ ప్రతినిధులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఎండాడ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుషికొండపై ప్రభుత్వ అవసరాల కోసం ఆయా భవనాలను నిర్మించామని, అయితే ఈ భవనాలు వైసీపీ నాయకులకు చెందినవని, వారి సొంతానికి నిర్మించుకున్నారంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రుషికొండపై గడిచిన మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడ నిర్మాణాలు సాగకుండా పర్యావరణం పేరుతో కోర్టులకు ఎక్కారని అమర్నాథ్ అన్నారు. ఈ నిర్మాణాలకు ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసామని ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మేరకే ముందుకు సాగామని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేదని దీనిని దృష్టిలో పెట్టుకుని సదరు భవనాలను నిర్మించామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారని, ఈసారి అధికారంలోకి వస్తే ఇక్కడ నుంచే పరిపాలన సాగించాలన్న ఆలోచన కూడా చేశారని అమర్నాథ్ వివరించారు. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. రుషికొండ భవనాల పేరుతో జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రుషికొండపై నిర్మించిన భవనాలు వీఐపీలు, వివిఐపీలకు కేటాయించే అవకాశం ఉన్నందున, భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటివరకు ఆ భవనాలను బహిర్గతం చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీటిని బహిర్గతం చేశారని అమర్నాథ్ అన్నారు. పర్యాటక శాఖకు సంబంధించిన ఈ భవనాలను ప్రస్తుత ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని అమర్నాథ్ సూచించారు.
2014-19 సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. హైదరాబాదులో ప్రభుత్వ ఖర్చుతో అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులను ఒక హోటల్లో ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన ఐదు సంవత్సరాల్లో అనేక మంచి పనులు చేసిందని వాటిని ప్రజలకు ఎందుకు తెలియజేయడం లేదని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేట పోర్టు, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వాటి గురించి ఏనాడు మాట్లాడని తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు ఋషికొండ భవనాలపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, పార్టీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ గుడివాడ అమర్నాథ్ ఋషి కొండ విషయమే మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడాలి.
70