*విచ్ఛిన్నకరమైన, అన్యాయమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించండి*
*ఆవాజ్ రౌండ్ టేబుల్ డిమాండ్*
వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఆవాజ్ విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ మీటింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ చట్టం రాజ్యాంగంపై, మైనారిటీల హక్కులపై దాడి చేస్తోంది. దేశ లౌకిక కూర్పును దెబ్బతీస్తూ, మతపరంగా చీలికలను పెంచుతున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఎ.అష్రప్ అధ్యక్షత వహించగా ఇందులో ముస్లిం సంఘాల పెద్దలు, మసీద్ పెద్దలైన మున్నీరు, అహ్మద్‌ఖాన్, అబిద్ బేగం, ఎదీన్, మున్నీషాలతో పాటు సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, 78వవార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్‌లు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఈ క్రింది తీర్మానం చేసింది.
గతంలో వున్న వక్ఫ్ చట్టం ..వక్ఫ్ఆస్తుల (ఇస్లామిక్ దానధర్మాలు) నిర్వహణకు సంబంధించి చట్టబద్ధమైన చట్రపరిధిని కలిగివుంది. ఆ ఆస్తుల సక్రమ నిర్వహణకు, రక్షణ హామీ కల్పిస్తోంది. మతపరమైన, దాతృత్వ సంబంధమైన ప్రయోజనాల కోసం వినియోగిస్తోంది. వక్ఫ్ ఆస్తుల క్రమబద్ధీకరణకు, వాటి దుర్వినియోగాన్ని, అనధికారిక విక్రయాలను నివారించేందుకు మార్గదర్శకాలను అందిస్తోంది.
సవరించిన చట్టంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు గత చట్టంలో పొందుపరిచిన ప్రాధమిక సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ సవరణ ద్వారా బిజెపి ప్రభుత్వం ప్రజలను చీల్చడానికి ఉద్దేశించిన తన హిందూత్వ ఎజెండాను ముందుకు తెస్తోంది. ముస్లింలు విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకోవడానికి గత చట్టాన్ని ఉపయోగించుకున్నారంటూ పదే పదే చెబుతోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నుండి ముస్లిమేతరులను నిషేధించాలని ఇస్లామిక్ ఆదేశాలు వున్నప్పటికీ సవరించిన చట్టం ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డుల్లో చేర్చింది. ఇది, మతాన్ని ఆచరించుకునేందుకు ముస్లింలకు గల రాజ్యాంగ హక్కుపై దాడి చేయడమే.
కనీసం ఐదేళ్ళుగా ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నట్లు ముస్లిం రుజువు చేసుకోవడం తప్పనిసరి చేయడం ద్వారా సవరించిన చట్టం ముస్లింలను వేధించడానికి మార్గాన్ని సుగమం చేసింది. మసీదులు తదితరాల నిర్మాణానికి అనేకమంది ముస్లిం యేతరులు కూడా సేవలందించారు. సవరించిన చట్టం కింద ఇక ఈ సోదర భావం, సౌభ్రాతృత్వం ప్రదర్శించడం సాధ్యం కాదు.
వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని రద్దు చేయడంతో ఆస్తుల స్వభావాన్ని నిర్ణయించేందుకు గల అధికారాన్ని వక్ఫ్ బోర్డు కోల్పోనుంది. వక్ఫ్ ఆస్తులు ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా వుంటాయి. దస్తావేజుల ద్వారా వక్ఫ్ (డాక్యుమెంట్ చేయబడిరది), మౌఖిక ప్రకటన ద్వారా వక్ఫ్ (నోటి మాటతో ప్రకటన), వినియోగం ద్వారా వక్ఫ్ (సుదీర్ఘకాలంగా వినియోగం ద్వారా నెలకొల్పబడిరది), ప్రభుత్వం మంజూరు చేసిన భూములు. కొత్త సవరణల కింద, దేశంలోని మెజారిటీ వక్ఫ్ ఆస్తులను (నోటి మాట ద్వారా ప్రకటించినవి లేదా దీర్ఘకాలంగా వినియోగిస్తున్నవి) ఇక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. వక్ఫ్ ఆస్తులు పెద్ద మొత్తంలో వున్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు ప్రతిపాదిత సవరణల ద్వారా ఈ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితులను ఎదుర్కోవాల్సిఉంటుంది.
వక్ఫ్ ఆస్తులను నిర్ధారించే అధికారాన్ని సర్వే కమిషనర్ నుండి ప్రభుత్వం నియమించిన రెవిన్యూ అధికారులకు బదిలీ చేయడం ద్వారా ఆరాధనా స్థలాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వృత్తివిద్యా కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. తద్వారా వక్ఫ్ ఆస్తులపై పట్టును కేంద్ర ప్రభుత్వం మరింత పెంచుకోనుంది. దీర్ఘకాల వినియోగం ద్వారా చారిత్రకంగా వక్ఫ్ ఆస్తులుగా భావిస్తున్న వాటిని రిజిస్ట్రేషన్ చేయాలన్న కొత్త ఆదేశం వాటిని జప్తు చేయాలనే ప్రభుత్వ రహస్య ఎజెండాను బట్టబయలు చేస్తోంది. వక్ఫ్ ట్రిబ్యునల్‌కు గల అధికారాలను రద్దు చేయడం ద్వారా వక్ఫ్ బోర్డు తాను సేవలందించే కమ్యూనిటీకి దూరమైపోతుంది.
ఈ సవరణల ద్వారా, ముస్లింల హక్కులను రద్దు చేయాలన్న తన ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రత్యేక ఉద్దేశ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. దేశ లౌకిక, ప్రజాతంత్ర కూర్పును పరిరక్షించేందుకు లౌకికవాదులు, ప్రజాస్వామ్య భావజాలం కలిగిన పౌరులందరూ ఈ విచ్ఛిన్నకరమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసేందుకు ఒక్క తాటిపైకి కలిసి రావాలని కోరింది.
ఇట్లు
ఎ.ఎ.అష్రప్
జిల్లా ప్రధాన కార్యదర్శి