* సామూహిక అక్షరాభ్యాసములు*
• శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసములు
• వివిధ జిల్లాలు, రాష్ట్రాలు నుంచి పాల్గొన్న సుమారు 1000 మంది చిన్నారులు
• విశాఖ శ్రీ శారదపీఠంలో అక్షరాభ్యాసం చేయించడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు
• ప్రతీ నిత్యం అమ్మవారి ఆరాధనాలతో సాక్షాత్తు శారదా అమ్మవారే పీఠంలో కొలువుదీరిన భావన కలుగుతుంది – ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు
విశాఖ శ్రీ శారదా పీఠంలో 28వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు (ఫిబ్రవరి 3) శ్రీ (వసంత) పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసములు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది చిన్నారులు తొలి అక్షరాలు దిద్దారు. విశేషంగా, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు స్వయంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరస్వతీ దేవి ఆవిర్భావ రోజు అయిన పవిత్ర వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వలన శుభం జరుగుతుందని, అందుకే పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి ఆదేశానుసారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు అన్నారు. విశాఖ శ్రీ శారద పీఠంలో అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించుకున్న వారందరూ అమ్మవారి అనుగ్రహంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఉంటారని అన్నారు. పీఠంలో ప్రతీ నిత్యం శారదా అమ్మవారిని స్తుతిస్తూ, అర్చనలు, ఆరాధిస్తూ, లలితా సహస్రనామ పారాయణలతో సాక్షాత్తు ఆ అమ్మవారి విశాఖ శారద పీఠంలో కొలువై ఉన్నట్టుగా భావన భక్తులకు కలిగిస్తోందన్నారు.. ఈ మహోత్సవంలో విశాఖపట్నం నుంచే కాకుండా ఒరిస్సా, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, అమలాపురం వంటి ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ పిల్లలకు విశాఖ శ్రీ శారదా పీఠంలో అక్షరాభ్యాసం చేయించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు… భక్తులు ఎంత మంది వచ్చినా ఏ ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. సాయంకాలం అమ్మవారి సన్నిధిలో శారదా సామ గాన ఝరి మరియు సంగీత కచేరీ నిర్వహించబడ్డాయి. ఇందులో ప్రముఖ గాయకురాలు శ్రీమతి గుమ్ములూరి శారదా సుబ్రహ్మణ్యం గారు ఆలపించిన గీతాలు ఆధ్యాత్మిక భావనను కలిగించాయి. కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ మహోత్సవాలు భక్తులకు ఒక విశేష అనుభూతిని కలిగించాయి.
రేపటి కార్యక్రమాలు:
• ఉ: 8.00 గంటలకు : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం
• ఉ: 9.00 గంటలకు : ఆదిత్య హృదయం పారాయణ
• ఉ: 9.30 గంటలకు : త్రిచసహిత అరుణ పారాయణ, విశేష సూర్యారాధన
• ఉ: 9.30 గంటలకు : సూర్య హోమం, సుబ్రహ్మణ్య హోమం
• ఉ: 10.00 గంటలకు : రాజశ్యామలా యాగం ప్రారంభం
• సా: 5.00 గంటలకు : సాంస్కృతిక కార్యక్రమాలు