*విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా*
*ఆగష్టు 22న సిఎండి కార్యాలయం వద్ద నిరసన*
ఆగష్టు 13న విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. బిజెపి నాయకత్వంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఏ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ పట్ల మరింత కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నది. దీనికి నిరసనగా ఆగష్టు 22 వతేదీన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సిఎండికి నిరసన తెలియజేయాలని, సెప్టెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పోరాట కమిటీ చైర్మెన్లు సిహెచ్ నరసింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్లు విజ్ఞప్తి చేసారు.
ద్వారకానగర్ పౌరగ్రంధాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర స్టీల్‌మంత్రి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రశక్తే లేదని పూర్తిసామర్ధ్యంతో పనిచేయించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ గత నెలరోజుల నుంచి యాజమాన్యం మరింత దిగజారుడు చర్యలకు పూనుకున్నది. కేంద్ర స్టీల్ క్యాబినెట్ మంత్రి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చిన తరువాత యాజమాన్యం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగానూ, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా నాశనం చేయాలనే దుర్భిర్ధితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనిని ఎదుర్కోవడానికి పోరాటం కొనసాగించడం తప్ప మరోమార్గం లేదని కమిటీ భావించింది.
గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు అత్యధిక లాభాలొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ స్టీల్‌ప్లాంట్ నేటి వరకు రూ॥54,380 కోట్లు పన్నులు, డివిడెండ్లు రూపంలో చెల్లించింది. పూర్తిసామర్ధ్యంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నడిపించాలని మాత్రమే అన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏకైక ప్రధాన సమస్య అయిన సొంతగనులను గత 30 సంవత్సరాల నుండి సమకూర్చడం లేదు. దీనివలన ప్రతి సంవత్సరం మిగిలిన స్టీల్‌ప్లాంట్‌ల కంటే అదనంగా రూ॥3వేల కోట్లు ఖర్చుచేస్తున్నది. అయినా సొంత లాభాలతో 73లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి చేరుకోవడానికి పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లు కృషిచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నీస్‌ను మూసివేసి ఉత్పత్తి 40శాతం తగ్గించడం వల్ల సుమారు 4వేల కోట్ల రూ.లు నష్టానికి నెట్టింది. ముడిఖనిజాన్ని రప్పించకుండా జాప్యం చేస్తున్నది. ప్రక్కనే ఉన్న గంగవరం పోర్టులో లక్ష టన్నులకు పైగా ఇనుప ఖనిజం నిల్వ ఉన్నా అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం గోడదాటి స్టీల్‌ప్లాంట్‌లోకి ముడిఖనిజాన్ని రానివ్వడం లేదు.
గత 5 సంవత్సరాల నుండి ఒక్క కార్మికుడిని కూడా విశాఖ స్టీల్ యాజమాన్యం కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోలేదు. 5వేలకు పైగా కార్మికులు, ఆఫీసర్లు రిటైర్ట్ అయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులలో 30శాతం మందిని, పర్మినెంట్ కార్మికులను వి.ఆర్.ఎస్ పేరుతో మరో 3వేల మందిని తొలగించాలని ప్రభుత్వం వ్యూహరచన చేసింది. వి.ఆర్.ఎస్ ఇవ్వడానికి రూ॥1400కోట్లు కేటాయించారు. మరోవైపున ముడి ఇనుపఖనిజం కొనుగోలు చేయడానికి డబ్బులు లేవనే సాకుతో ఉత్పత్తి తగ్గిస్తున్నారు. ఉత్పత్తిని పెంచడానికి కార్మికులు కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాలి. దానికి భిన్నంగా ప్రైవేట్ యాజమాన్యాలకు కావాల్సిన పద్ధతిలో ట్రిమ్మింగ్ చేస్తున్నారు. గత నెలరోజుల్లో కార్మికులకు, అధికారులకు ఉన్న అనేక హక్కులను, అధికారులకిచ్చే పిఆర్‌పిని, కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను నిలిపివేయాలని నిర్ణయించారు. కాంట్రాక్ట్ కార్మికులలో 30శాతం మందిని తగ్గించాలని హెచ్.ఓ.డిలకు ఆదేశాలిచ్చారు. డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా, ఉత్పత్తిని పెంచకుండా స్టీల్‌ప్లాంట్‌ను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
దీనికి నిరసనగా ఆగష్టు 22న సిఎండి కార్యాలయం వద్ద కార్మికులు నిరసన తెలియజేస్తారు. సెప్టెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ‘రాస్తారోకో’ను రాష్ట్ర ప్రజలంతా జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేసి ఉత్పత్తి పూర్తిసామర్ధ్యంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నడపాలని కోరుతున్నాము.
ఈ ప్రెస్‌మీట్‌లో వి.శ్రీనివాసరావు, దాసరి సురేష్‌బాబు, పంచదార్ల తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
సిహెచ్ నరసింగరావు
చైర్మెన్
విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆగస్టు 22న సీఎం కార్యాలయం వద్ద నిరసన
53