138 సంవత్సరాల మహా మర్రి వృక్షానికి లిటిల్ ఏంజెల్స్ విద్యార్థినులతో రాఖీ కట్టి పూజించారు

by vvwnews.com

మహా వృక్షాలు పరిరక్షణ కోసం రాఖీ కట్టాలి
– పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
– చెట్లకు పవిత్రధారాలు కట్టి కాపాడడం మన సాంప్రదాయం
– సమస్త జీవరాశిని కాపాడుకోవాలి
– కె ఎస్ విశ్వనాథన్, మెట్రోపొలిటన్ కమిషనర్, వి ఎం ఆర్ డి ఏ
మహా వృక్షాలు పరిరక్షించుకోవాలి, పరిరక్షణ కోసం రాఖీ కట్టాలి అని వి ఎం ఆర్ డి ఏ మెట్రోపొలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని దొండపర్తి రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న 138 సంవత్సరాల మహా మర్రి వృక్షానికి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిల నేతృత్వంలో సెంట్ జోసెఫ్ కళాశాల, లిటిల్ ఏంజెల్స్ విద్యార్థినులతో రాఖీ కట్టి పూజించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ మహా వృక్షానికి రాఖీ కట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే అంశాన్ని గుర్తు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో బిష్ణోయి తెగ త్యాగాలను, సుందర్ లాల్ బహుగుణ సాగించిన ఉద్యమం, పిప్లాంత్రి గ్రామంలో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటి సాగిస్తున్న పండగ కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. వాటిని దృష్టిలోనికి తీసుకుని 2000 సంవత్సరం నుండి గ్రీన్ క్లైమేట్ టీం ఈ మహా వృక్షాన్ని కాపాడి చెట్లకు పవిత్రధారాలు కట్టి కాపాడడం మన సాంప్రదాయంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
లేబర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మోహన లక్ష్మీ మాట్లాడుతూ సమస్త జీవరాశిని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. భూమి మీద ఏ జీవి అంతరించిన దాని ప్రభావం మానవాళి మీద ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వృక్షాబంధన కార్యక్రమం నిర్వహించడం అవసరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అత్యధికులను భాగస్వాములు చేయాలని ఆమె కోరారు.
విశాఖపట్నం పోర్టు ఉద్యానవన శాఖ అధికారిణి రాధిక మాట్లాడుతూ విద్యార్థినులతో వృక్షాబంధన్ కార్యక్రమం ఆనందదాయకం అన్నారు. మన తల్లి మనకు జన్మనిస్తే చెట్లు మనకి ప్రాణవాయువుని అందిస్తున్నాయన్నారు. అందుకే మనం చెట్లను కాపాడుకోవాలి, పెంచాలి అని కోరారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా చేయి చేయి పట్టుకుని మహా మర్రి మాను చుట్టు ఒక వలయంలా తయారై మహా వృక్షాలను తాము కాపాడుకుంటామని పేర్కొన్నారు. చెట్టును పట్టుకొని చెట్టుకి మనిషికి విడదీయరాని సంబంధం ఉన్నదని గుర్తుంచుకోవాలని నినాదాలు పలికారు. ఈ కార్యక్రమంలో వనమాలి సీటిజి గ్రూప్ విద్యార్థులకు మొక్కలు పంచారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె వి రత్నం, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, వనమాలి సిటిజి అడ్మిన్ మళ్ళ సరిత, ప్రతినిధులు విజయలక్ష్మి, చింతకాయల సుభారమా ఐ ఐ ఏ ఎం నుండి డాక్టర్ వరలక్ష్మి, సమత డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles